తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవాహారంలో రోజుకో కొత్త విషయం బయటకొస్తు వస్తుంది. తవ్వేకొద్దీ విచిత్ర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అవాక్కవుతున్నారంట సిట్ అధికారులు. ఇప్పటికే ప్రశ్నాపత్రాలకు ధరలు నిర్ణయించడం.. అడ్వాన్స్ అమౌంట్ ఫిక్స్ చేయడం.. వాట్సప్ రూపంలో ఆన్ లైన్ లో సైతం అమ్మకాలు జరపడం… ఒకటేమిటి.. ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి.
పేపర్ లీకేజీ కేసులో ముగ్గురు నిందితుల కస్టడీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. మార్చి 30వ తేదీ గురువారం నిందితులను సీసీఎస్ నుంచి హిమాయత్ నగర్ సిట్ ఆఫీస్ కు తరలించారు పోలీసులు. ఏ10 శమీమ్, ఏ11 రమేష్, ఏ12 సురేష్ లు రాసిన గ్రూప్ –1 పేపర్ పై సిట్ అధికారులు ప్రశ్నించారు. గ్రూప్ –1 పేపర్ ప్రవీణ్ నుంచి చేరినట్లు ముగ్గురు నిందితులు సిట్ కు స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు వేరే ఎవరికైనా పేపర్స్ ఇచ్చారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజాగా ఈ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో నిందితుడు డాక్యానాయక్ ఏఈ పేపర్ తో దాదాపు రూ.25 లక్షలు వసూలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ పేపర్ కోసం నీలేశ్, గోపాల్ నాయక్ రూ.13.5 లక్షలు చెల్లించగా… రాజేందర్ రూ.5 లక్షలు, ప్రశాంత్ రూ.7.5 లక్షలు చెల్లించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే వీళ్లంతా ఈ డబ్బులు తేవడానికి చేసిన ప్రయత్నాలకు, పనులకు సిట్ అధికారులు ఆశ్చర్యపోతున్నారంట.
ఈ పేపర్లు డూప్లికెట్ కాదని బలంగా నమ్మిన వ్యక్తుల్లో నీలేశ్, గోపాల్ నాయక్ లు తమ తమ పొల్లాలు తాకట్టుపెట్టి మరీ ఇంత మొత్తంలో డబ్బును డాక్యా నాయక్ కు అప్పజెప్పి పేపర్ ను కొనుగోలు చేయగా… ప్రశాంత్ బంగారం తాకట్టు పెట్టి మరీ రూ.7 లక్షలు తెచ్చినట్లు విచారణలో బయటపడిందట. దీంతో… డాక్యా నాయక్ బ్యాంక్ అకౌంట్లను సిట్ అధికారులు సీజ్ చేశారు.
కాగా… టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్ అధికారులు చేసిన దర్యాప్తు ప్రకారం… ఇప్పటి వరకు ఏఈ పేపర్లు 12 మందికి, గ్రూప్-1 పేపర్లు ఐదుగురికి లీకైనట్లు ప్రాథమికంగా నిర్థారణ అయ్యిందంట. ఇదే క్రమంలో ఇప్పటి వరకు జరిగిన అరెస్టుల సంఖ్య 15కు చేరింది. వీరితోపాటు న్యూజిలాండ్ లో ఉన్న రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ రెడ్డితో కలిసి నిందితుల సంఖ్య 16కు చేరుకుంది. వీర్తోపాటు టీఎస్పీఎస్సీలో ఇంకా ఎంతమంది ఉద్యోగులకు లీకేజీ విషయం తెలుసన్న కోణంలో సిట్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.