వైఎస్సార్.! ఇది పేరు మాత్రమే కాదు, ఓ బ్రాండ్.!

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం, యేటా ఈ రోజుని ‘రైతు దినోత్సవం’గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పలు సంక్షేమ పథకాలకి వైసీపీ హయాంలో వైఎస్సార్ పేరు పెట్టుకోవడం చూస్తున్నాం.!

సంక్షేమ పథకాలకి ఆద్యుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. అనడం సబబు కాదుగానీ, ఆయన హయాంలో అనేక సంక్షేమ పథకాలు సరికొత్తగా తెరపైకొచ్చాయన్నది మాత్రం నిర్వివాదాంశం. 108 అంబులెన్సుల దగ్గర్నుంచి, ఆరోగ్యశ్రీ, విద్యార్థుల ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్.. ఇలా ఒకటా.? రెండా.? ‘సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్’ అనిపించేలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సాగింది.

జలయజ్ఞం కావొచ్చు, పేదవాడికి గూడు కావొచ్చు.. ఇలా చాలా సంక్షేమ పథకాలతో తెలుగు నేలపై చెరగని సంతకం చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రెండోసారి అధికారంలోకి వస్తూనే, అనూహ్యంగా అకాల మరణం చెందారు.. అదీ హెలికాప్టర్ ప్రమాదంలో.

వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటికీ, ‘ప్రజలు పూర్తి మార్కులు ఇవ్వలేదు.. మనం మరింత బాగా పని చేయాలి..’ అని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాజకీయ ప్రత్యర్థుల్ని గౌరవించడం, ఆ రాజకీయ ప్రత్యర్థుల మన్ననలు కూడా అందుకోవడమంటే చిన్న విషయం కాదు.

రాజన్న పాలన.. అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోగలుగుతున్నారంటే, అదీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘనత. ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే చెరగని చిరునవ్వుకి, అచ్చ తెలుగు పంచెకట్టుకీ నిలువెత్తు నిదర్శనం.

రాజశేఖర్ రెడ్డి జయంతి నేపథ్యంలో, అప్పట్లో రాజకీయ ప్రత్యర్థులుగా వున్నవారూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు.. అదీ మంచి ఆలోచనతోనే. దటీజ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.