దేశచరిత్రను పక్కనపెట్టినా తెలుగురాష్ట్రాల్లో మాత్రం వైఎస్ కుటుంబం సాధించింది మాత్రం నిజంగా చరిత్రనే చెప్పాలి. ఒకే కుటుంబం నుండి ముగ్గురు పాదయాత్రలు చేయటం బహుశా భవిష్యత్తులో కూడా ఏ కుటుంబానికీ సాధ్యం కాదేమో. తెలుగురాష్ట్రాల్లో మొదటసారిగా సుదీర్ఘకాలం పాదయాత్ర మొదలైంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితోనే. అంతకుముందు మాజీ హోంమంత్రి పట్టోళ్ళ ఇంద్రారెడ్డి పాదయాత్ర చేసినా అది కొంత ప్రాంతానికే పరిమితమైంది. సరే ఇంద్రారెడ్డి విషయం పక్కనపెడితే ఒకే కుటుంబం నుండి ముగ్గురు పాదయాత్ర చేయటం మాత్రం నిజంగా చరిత్రనే చెప్పాలి. మధ్యలో చంద్రబాబునాయుడు కూడా వస్తున్నా మీ కోసం పేరుతో పాదయాత్ర చేశారనుకోండి అది వేరే సంగతి.
మొదటగా ప్రజా ప్రస్ధానం పేరుతో వైఎస్, తర్వాత మరో ప్రజా ప్రస్ధానం పేరుతో వైఎస్ కూతురు షర్మిల పాదయాత్ర చేశారు. తాజాగా ప్రజా సంకల్పయాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి అంతకుముందున్న రికార్డులను బద్దలుకొట్టారు. 2003లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ నాయకత్వానికే ముప్పు వచ్చింది. దాంతో తనను తాను ప్రూవ్ చేసుకోవటం కోసం మండుటెండలో వైఎస్ సాహసం చేసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో మొదలుపెట్టిన పాదయాత్రతో 1475 కిలోమీటర్లు కవర్ చేసి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగించారు.
తర్వాత 2012-13లో జరిగిన రాజకీయ పరిణామాల్లో జగన్ జైలు పాలయ్యారు. అప్పుడు పార్టీని రక్షించుకోవటం కోసం వైఎస్ కూతురు, జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్ధానం మొదలుపెట్టారు. షర్మిల కూడా ఇటు తెలంగాణా అటు సీమాంధ్ర జిల్లాలను కవర్ చేశారు. 230 రోజులపాటు జరిగిన పాదయాత్రలో షర్మిల 3112 కిలోమీటర్లు కవర్ చేశారు. అప్పట్లో కూడా షర్మిల వెంట పార్టీ నేతలే అండగా నిలిచారు. పాదయాత్రలో ఉండగా షర్మిలకు కూడా కాలికి చిన్న ఆపరేషన్ అయ్యింది. ఆపరేషన్ అయిన తర్వాత షర్మిల మళ్ళీ పాదయాత్రను కొనసాగించారు. పాదయాత్ర పూర్తయిన తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండకుండా తెరవెనక్కు వెళ్ళిపోయారు.
ఇక తాజాగా జగన్ పూర్తి చేసిన ప్రజా సంకల్ప యాత్ర గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. 2017, నబంవర్ 6వ తేదీన మొదలైన పాదయాత్ర 2019, జనవరి 9వ తేదీన ముగిసింది. కడప జిల్లాలోని ఇడుపుల పాయలో మొదలుపెట్టిన యాత్రను జగన్ కూడా ఇచ్ఛాపురంలోనే ముగించటం విశేషం. తన పాదయాత్రలో సోదరి షర్మిల కవర్ చేసిన 3112 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించారు. అంతేకాకుండా 341 రోజుల యాత్రలో 3648 కిలోమీటర్లు కవర్ చేయటమన్నది పెద్ద చరిత్రగానే చెప్పుకోవాలి. మొత్తం మీద ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పాదయాత్రలు చేయటమన్నది బహుశా ఇంకే కుటుంబంలో సాధ్యం కాదేమో.