వైఎస్ వివేకా డెత్ మిస్టరీ.! అలుపెరగని రాజకీయం.!

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎప్పటికి కొలిక్కి వస్తుందో ఏమో.! అసలు ఈ కేసులో దోషులెవరన్నది తేలుతుందో లేదో.! రాష్ట్ర స్థాయిలో ‘సిట్’ ఏమీ తేల్చలేకపోయింది. సీబీఐ ఏళ్ళ తరబడి ఈ కేసుని విచారిస్తూనే వుంది. ఇంత అలసత్వమా.? అంటూ సర్వోన్నత న్యాయస్థానం కూడా గుస్సా అయ్యింది.

అవసరమైతే విచారణాధికారిని మార్చండంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం పెను సంచలనం ఈ కేసులో. మరి, విచారణాధికారి మారతారా.? కేసు విచారణ సరైన మార్గంలో ముందు ముందు నడుస్తుందా.? ఎందుకీ డెత్ మిస్టరీ ఇంత కాంప్లికేట్ అవుతోంది.? 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఆరోపణలు చేసింది అప్పట్లో వైసీపీ. అంతకు ముందు, అది గుండె పోటు అని వైసీపీనే తీర్మానించడం గమనార్హం.

ఇప్పుడేమో, అదే వైసీపీ.. వివేకానంద రెడ్డి మతం మార్చుకుని రెండో పెళ్ళి చేసుకున్నారనీ, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆయన హత్య జరిగిందని అంటోంది. కాదు కాదు, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని అబ్బాయ్ వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి సాయంతో చంపించేశాడన్నది టీడీపీ ఆరోపణ.

ముందు ముందు ఈ హత్య కేసులో ఇంకెన్ని రాజకీయ సంచనాలు చోటు చేసుకుంటాయోగానీ, అసలంటూ ఈ కేసులో దోషులెవరో ఇప్పటిదాకా తేలకపోవడం ఆశ్చర్యకరం.