రాజకీయాల్లో అరెస్టులు, కేసులు కొత్తేమీ కాదు. పైగా, వైసీపీ అధికారంలో వుంది. తమ అధికారాన్ని ప్రయోగించి, విపక్ష నేతల మీద కేసులు పెట్టిస్తోంది. అరెస్టులు జరుగుతున్నాయ్.! చివరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారినీ రాత్రికి రాత్రి ‘లిఫ్టు’ చేస్తున్న వైనం కనిపిస్తోంది. కోర్టుల్లో మొట్టికాయలు.. ఇవన్నీ సర్వసాధారణమే.
మొన్నీమధ్యనే ఏపీ సీఐడీ, మార్గదర్శి వ్యవహారంలో రామోజీకి మద్దతుగా నిలిచిన రాజకీయ విశ్లేషకులకీ అల్టిమేటం జారీ చేయడం చూశాం. మరి, వైఎస్ భాస్కర్ రెడ్డి వ్యవహారంలో, వైసీపీ నేతలకు సీబీఐ అల్టిమేటం జారీ చేస్తే పరిస్థితి ఏంటి.? కాస్త ఆలోచించుకోవాలి కదా.! వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ, నిన్ననే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసింది. భాస్కర్ రెడ్డి ఎవరో కాదు, కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తండ్రి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాబాయ్ అవుతారు. వైఎస్ జగన్ సతీమణి భారతికి స్వయానా మేనమామ.! అందుకే, భాస్కర్ రెడ్డి అరెస్టుని ఖండిస్తూ, వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పెద్దయెత్తున హంగాయా చేస్తుండడం చూస్తున్నాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు.. మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అవసరమా ఇదంతా.? ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. సీబీఐ విచారణ కోరిందే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి’ అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించి, ఆ తర్వాత నాలిక్కరచుకున్నారు.
అసలెందుకీ తడబాటు.? వైఎస్ వివేకా హత్య కేసులో ఇంతలా వైసీపీ ఎందుకు కంగారు పడాలి.? సీబీఐ విచారణను తొలుత అడిగిందే వైఎస్సార్సీపీ. అది 2019 ఎన్నికల సమయం. అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయానా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డిని వెంటేసుకుని, ఢిల్లీకి వెళ్ళి మరీ సీబీఐ విచారణ కోరి వచ్చారాయె.! ఇప్పుడీ తడబాటు, వైసీపీపై అనుమానాల్ని ఈ కేసులో మరింత పెంచుతోంది.