మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏళ్ళు గడుస్తున్నాయ్ తప్ప, ఈ కేసులో ‘దోషి’ ఎవరన్నది తేలడంలేదు. చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రభుత్వ సిట్ (ఎన్నికల సమయంలో) దగ్గర్నుంచి, ఇప్పుడు సీబీఐ విచారణ వరకు.. ‘కొడను అయితే తవ్వుతున్నారుగానీ, ఎలకని సైతం పట్టలేకపోతున్నారు’ అన్నట్లే వుంది పరిస్థితి.
మధ్యలో కోవిడ్ కారణంగా, కేసు విచారణ విషయమై సీబీఐ కొంత అలసత్వం ప్రదర్శించక తప్పలేదు. సాక్షులు సహకరించకపోవడం, ‘సీమ’ మార్కు బెదిరింపులు.. వెరసి, ఈ కేసు సాగుతూ సాగుతూ వస్తోంది.
చిత్రమేంటంటే, వైఎస్ వివేకా హత్య కేసుని 2019 ఎన్నికల సమయంలో టీడీపీ, వైసీపీ గట్టిగా వాడేసుకున్నాయి రాజకీయ అవసరాల నిమిత్తం. ఆ తర్వాత జనసేన అధినేత కూడా ఈ ‘వాడకం’ జాబితాలో చేరిపోయారు. తాజాగా ‘బాబాయ్‌ని చంపినవాళ్ళతో రాజకీయ పోరాటం చేస్తున్నాం’ అని జనసేన అధినేత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
కేసు విచారణను కడప ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కోర్టుకి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మార్చడం జరిగింది. ఈ బదిలీ వల్ల కేసు విచారణలో ఏమైనా ముందడుగు పడుతుందా.? అంటే, అది మళ్ళీ మిలియన్ డాలర్ క్వశ్చన్.
టీడీపీ ఈ డెత్ మిస్టరీని విచ్చలవిడిగా వాడేస్తోంది. 2024 ఎన్నికల్లో టీడీపీనే కాదు, జనసేన కూడా ఈ డెత్ మిస్టరీని రాజకీయంగా వాడేయనుంది. కానీ, 2019 ఎన్నికల్లో వాడినట్లు వివేకా హత్య కేసు వ్యవహారాన్ని వైసీపీ వాడే అవకాశం రాజకీయంగా వుండకపోవచ్చు. దోషులెవరో తేలదుగానీ.. రాజకీయంగా వివేకా డెత్ మిస్టరీ మాత్రం ఎప్పుడూ లైమ్‌లైట్‌లో వుంటూనే వుంటుంది.