ఎవరీ రామ్ సింగ్.. ఏమా కథ.? సీబీఐ అధికారి ఈ రామ్ సింగ్. వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీని ఛేదించే క్రమంలో ఈ సీబీఐ అధికారి రామ్ సింగ్ పేరు మార్మోగిపోయింది. ఏళ్ళ తరబడి కేసు విచారణ జరుగుతోందిగానీ, దోషులెవరన్నదీ తేలలేదు. కుట్ర పూరితంగా రామ్ సింగ్ వ్యవహరిస్తున్నారంటూ ఈ కేసులో నిందితులు ఏకంగా దర్యాప్తు అధికారి మీద ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఎట్టకేలకు ఈ కేసులోంచి రామ్ సింగ్ తప్పుకున్నాడు. కాదు కాదు, సర్వోన్నత న్యాయస్థానం తప్పించింది. దర్యాప్తు సజావుగా సాగడంలేదనీ, రామ్ సింగ్‌ని వుంచుతారో, ఇంకొక అధికార్ని నియమిస్తారో తేల్చాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో, సీబీఐ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది.
రామ్ సింగ్‌ని పక్కకు తప్పించి, కొత్త దర్యాప్తు బృందాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆయా బృంద సభ్యుల వివరాల్ని సీబీఐ, సర్వోన్నత న్యాయస్థానం ముందుంచింది. ఏప్రిల్ నెలాఖరులోగా దర్యాప్తు పూర్తి చేయాలనీ, ఆరు నెలల్లో ట్రయల్ పూర్తి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. వైఎస్ వివేకా హత్య కేసులో కుట్ర కోణాన్ని బయటపెట్టాల్సిందేనని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. అంతే, కథ మళ్ళీ మొదటికి వచ్చినట్లయ్యింది. దర్యాప్తు మొదటి నుంచీ జరుగుతుందా.? అదే జరిగితే, ఈసారి ఏ కోణంలో దర్యాప్తు జరుగుతుంది.? అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కలిసే హత్యకు పథక రచన చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. తొలుత నారాసుర రక్త చరిత్ర.. అని ఆరోపించిన వైసీపీ, ఆ తర్వాత మాట మార్చి, రెండో పెళ్ళి కోసం మతం మార్చుకున్న వైఎస్ వివేకా, కుటుంబ కలహాలతో హత్యకు గురయ్యారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఏది నిజం.? ఎప్పటికి ఆ నిజం తేలుతుంది.? వేచి చూడాలిక.!