వైవి విషయంలో కీలక నిర్ణయం

మొన్నటి ఎన్నికల్లో పార్టీ బాధ్యతలు చూసిన మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డికి తొందరలో రాజ్యసభ సభ్యత్వం దక్కనున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యునిగా గెలిచిన వైవికి మొన్నటి ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వలేదు. పార్టీని అధికారంలోకి తేవటంలో భాగంగా కొందరు సీనియర్లకు  జగన్ పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగించారు.

అటువంటి సీనియర్లలో ఒకరైన వైవికి ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించారు.  తూర్పులోని మొత్తం 19 నియోజకవర్గాల్లో వైసిపి ఏకంగా 14 నియోజకవర్గాల్లో గెలిచింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో వైసిపి 13 గెలిచింది. మొత్తం 34 నియోజకవర్గాల్లో 27 గెలవటం మామూలు విషయం కాదు. దాంతో జగన్ కూడా ఫుల్లు ఖుషీగా ఉన్నారు.

అందుకనే తొందరలో బాబాయ్ వైవికి రాజ్యసభ సీటు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. భవిష్యత్తులో ఏపికి రాబోయే రాజ్యసభ సీట్లలో సింహభాగం వైసిపికే దక్కుతాయనటంలో సందేహం లేదు. ఎందుకంటే వైసిపి 151 అసెంబ్లీ సీట్లలో గెలిచిన కారణంగా వచ్చే ప్రతీ రాజ్యసభ సీటు వైసిపికే దక్కుతుంది. కాబట్టి వైవికి పెద్దల సభలో చోటు ఖాయం. కాలం కలసివచ్చి జగన్ గనుక ఎన్డీఏలో చేరితే కేంద్రమంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉంది.