YS Jagan – YS Sharmila: జ‌గ‌నన్నకు ష‌ర్మిల సూటి ప్రశ్నలు.. సమాధానం ఇస్తారా?

ఏపీ రాజకీయాల్లో మరోసారి వైఎస్ కుటుంబ రాజకీయ వేడి పెరిగింది. కాంగ్రెస్ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల కాస్త విమర్శల నుంచి దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు ఒక్కసారిగా ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా లిక్కర్ స్కాం, పోలీసులపై జగన్ వ్యాఖ్యలపై షర్మిల సంచలన ప్రశ్నలు సంధించడం చర్చనీయాంశంగా మారింది.

లిక్కర్ స్కాంను థ్రిల్లర్ సిరీస్‌తో పోల్చిన షర్మిల, వైసీపీ నాయకులు భయంతో ఊగిపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా జగన్ ఇటీవల పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “బట్టలు ఊడదీస్తాడట, విదేశాల్లో ఉన్నా పట్టుకుంటాడట.. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రికి తగిన మాటలు కాదు” అని మండిపడ్డారు. పోలీసులను ఒకప్పుడు జగన్ వాడుకున్న తీరును రఘురామ కృష్ణరాజు, కాదంబరి జెత్వానీ వంటి వారు వివరించగలరని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీకి ఎందుకు హాజరుకావడం లేదో స్పష్టత ఇవ్వాలంటూ షర్మిల డిమాండ్ చేశారు. “మీరు నిర్దోషి అయితే స్వయంగా విచారణ కోరండి. తప్పు లేకపోతే, మీకు ఉరి వేయాలంటూ ఛాలెంజ్ చేయండి. లేకపోతే మీరు తప్పు చేసినట్టు ప్రజలు భావిస్తారు” అంటూ కఠినంగా హెచ్చరించారు. వైసీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలపై డిజిటల్ లావాదేవీలు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. వచ్చిన ఆదాయం ఎవరి కిందికి పోయిందో జగన్ తానే చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ వ్యవహార శైలిపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన షర్మిల, తన సోదరుడిపై ఈ స్థాయిలో నిప్పులు చెరుగడమంతో రాజకీయంగా పెరిగిన దూరం మరోసారి బహిరంగమైంది. ముఖ్యంగా లిక్కర్ స్కాం చుట్టూ సాగుతున్న వివాదాల నేపథ్యంలో ఈ విమర్శలు మరింత తీవ్ర చర్చకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.