పొలిటికల్ పార్టీ పెట్టడమంటే కామెడీ అయిపోయింది ఈ రోజుల్లో అని అప్పుడెప్పుడో ఒక మాస్ లీడర్ అన్న మాట నిజమే అనిపిస్తోంది. జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆంధ్రాను వదిలేసి తెలంగాణలో పార్టీ పెడతానని అనడంతోనే అనేక రకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. అన్నతో పడకనే, పార్టీలో పదవి లేకనే షర్మిల తెలంగాణకు వచ్చారని కొందరంటే దీనివెనుక పెద్ద పార్టీల హస్తం ఉందని ఇంకొందరు అంటున్నారు. అయితే తెలంగాణలోని ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్ మాత్రం షర్మిల తెలంగాణకు వచ్చి పార్టీ పెడతానానందం ముమ్మాటికీ తప్పే అంటున్నారు. ఆదిలోనే ఆమెకు అడ్డుకట్టవేయడానికి స్థానికతను లేవనెత్తుతున్నారు.
తెలంగాణకు చెందనివారు తెలంగాణను పాలిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అంటుంటే ఏమాత్రం జ్ఞానం లేనివాళ్లు పార్టీ పెడతాం, పాలిస్తామంటే కుదరదని తెరాస ఓపెన్ వార్నింగ్ ఇచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో తనను తాను ఎలా సమర్థించుకోవాలో షర్మిలకు తోచట్లేదు. అసలు పార్టీ పెట్టడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం, లక్ష్యం ఏమిటనేది ఆమెకు క్లారిటీ లేదు. మాటకు ముందు మాటకు తర్వాత రాజన్న రాజ్యం తీసుకొస్తాం అంటారే తప్ప నేరుగా అధికార పార్టీ తెరాస మీద విమర్శలు చేయడం కానీ కేసీఆర్ పనితీరు బాగోలేదని, ఆయన పాలనలో రైతులు దెబ్బతిన్నారని తన ఉద్దేశ్యాలను కుండబద్దలుకొట్టినట్టు చెప్పలేకపోతున్నారు. రాజన్న రాజ్యం అనే నినాదం వింటేనే ఇదెక్కడి లక్ష్యం అంటున్నారు చాలామంది.
ఇక ప్రధాన పార్టీలు లేవనెత్తిన స్థానికేతరులనే అంశాన్ని ఎదుర్కోవడానికి షర్మిల వెతుక్కున్న జవాబు తాను తెలంగాణ కోడలిని అని. తన భర్త అనిల్, అత్తమామలు తెలంగాణకు చెందినవారేనని, మెట్టినింట్లో నాకు హక్కులు ఉండవా అని అంటున్నారామె. అయితే ఈ కోడలి కార్డును ఎంతవరకు తెలంగాణ జనం ఆమోదిస్తారు అనేదే డౌట్. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే ప్రయత్నంలో ఉన్నాయి. కేసీఆర్ కూడ గతంలో మాదిరి చూసీచూడనట్టు లేరు. ఇష్యూ ఏదైనా కట్టే కొట్టే తెచ్చే అన్న రీతిలో తేల్చి అవతల పారేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పాత కేసీఆర్ కనబడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ పెట్టబోతున్న షర్మిల రాజన్న రాజ్యం తెస్తా, తెలంగాణ కోడల్ని.. నాకు ఓట్లు వేయండి అంటే కుదిరేపనేనా అనిపిస్తోంది.