ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయ యుద్ధం షురూ అయ్యింది. ‘వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని చూసి భయపడోతుంది..’ అంటూ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఇటీవల నియమితురాలైన షర్మిల, తన పేరుని వైఎస్ షర్మిలా రెడ్డిగా పేర్కొనడం గమనార్హం. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి..’ అంటూ షర్మిల చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
‘పులివెందుల పులి బిడ్డ’ అంటూ వైఎస్ షర్మిలా రెడ్డికి ట్యాగ్ లైన్ తగిలించేశారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి. పోలీసులు రోప్‌లతో మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ తాజాగా షర్మిల తీవ్ర ఆరోపణలు చేయడం కొసమెరుపు.
ఎక్కడో ఇలాంటి డైలాగులు షర్మిల నోటి వెంట విన్నట్లుంది కదూ.! అది తెలంగాణ రాజకీయంలో.! అప్పట్లో ఆమె పేరు కేవలం వైఎస్ షర్మిల మాత్రమే. అప్పుడామె తెలంగాణ బిడ్డ. తెలంగాణ కోడలు.! తెలంగాణలో ‘ఆడ’ పిల్ల కాస్తా, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ‘ఆడ’ పిల్లగా మారిపోయిందన్నమాట.
రాజకీయం అంటేనే ఇలా వుంటుంది.! తెలంగాణలో రాజకీయ దుకాణం వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాలగర్భంలో కలిపేసి, అక్కడి దుకాణం పూర్తిగా సర్దేసి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చేశారు.
‘కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాం..’ అని అప్పట్లో చెప్పుకున్న షర్మిల, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి, కాంగ్రెస్ నేతగా మారిపోయారు. అంతా బాగానే వుందిగానీ, వైఎస్సార్సీపీని ఢీకొనడం షర్మిలకు అంత తేలికైన వ్యవహారమా.?