వైఎస్ షర్మిల ప్రశ్నలు వైఎస్ జగన్‌కి తిప్పలు.!

రాజధాని ఏది.? పోలవరం ప్రాజెక్టు ఎక్కడిదాకా వచ్చింది.? ప్రత్యేక హోదా ఏమైంది.? ఈ మూడు ప్రశ్నలూ వైసీపీ మీదకు టీడీపీ నుంచో, జనసేన నుంచో దూసుకురావడంలో వింతేమీ లేదు. దత్త పుత్రుడనో, ప్యాకేజీ స్టార్ అనో, పెళ్ళాల ప్రస్తావన తీసుకొచ్చో.. విషయాన్ని డైవర్ట్ చేయడం వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద కష్టమేమీ కాదు.

కానీ, వైఎస్ షర్మిల సంధించే ప్రశ్నలకు వైఎస్ జగన్ సమాధానం చెప్పడం చాలా చాలా కష్టమైన వ్యవహారమే. ఈ ప్రశ్నలే కాదు, వైఎస్ షర్మిల నుంచి చాలా ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. రోడ్లు సరిగ్గా లేవని నిలదీస్తున్నారు.. ఇంకా ఇంకా చాలా ప్రశ్నలు వైఎస్ షర్మిల సంధిస్తున్నారు.

ఎన్నికల ముందర వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇదంతా నిజంగానే పెద్ద తలనొప్పి. ఘాటైన వ్యాఖ్యలు చేద్దామంటే,అదేమన్నా మళ్ళీ వైసీపీకి నెగెటివ్ అవుతుందా.? అని ఒకటికి పదిసార్లు తమాయించుకోవాల్సి వస్తోందిట వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.

పార్టీలో కింది స్థాయి నేతల నుంచి వైఎస్ షర్మిలకు కౌంటర్ ఎటాక్ గట్టిగానే పడుతోంది. ఓ ఎమ్మెల్యే అయితే, అసలు వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత కూతురు కాదు, పెంపుడు కూతురు.. అంటూ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసేశాడు. కానీ, ఇది వైసీపీకి చెడ్డ పేరు తెచ్చే కౌంటర్ ఎటాక్ మాత్రమే.

ఏ ఉద్దేశ్యంతో వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టారోగానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇదో పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారిపోయింది. చంద్రబాబు గ్యాంగులో వైఎస్ షర్మిలని కలిపేయాలని జగన్ చూస్తున్నా, అదంత సత్ఫలితాన్ని ఇచ్చేలా కనిపించడంలేదు.