షర్మిల రాజకీయం: జగన్ కు తలుపుచెక్క.. చంద్రబాబుకు తమలపాకు!

కొంతమందికి అధికారంలో ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయని.. ఏమి మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, అసలు ఎవరి గురించి మాట్లాడాలి అనే సృహ కోల్పోతారని అంటుంటారు. తామే దేవుళ్లం అన్న స్థాయిలో వారి ప్రవర్తన ఉంటుందని చెబుతుంటారు. అయితే… దీనికి పూర్తి భిన్నంగా అధికారం లేకపోయినా.. ఒక్క సీటూ గెలవకపోయినా.. స్వయంగా ఆమే గెలవకపోయిన బాధలోనో ఏమో కానీ.. షర్మిళ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఏపీలో కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రతిపక్షం అయితే… ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి వైఎస్ షర్మిళ ప్రతిపక్షంగా మారారనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. వినుకొండలో జరిగిన దారుణంతో పాటు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘోరాలపై ఢిల్లీ వేదికగా నిరసన తెలపాలని జగన్ భావించారు. దీనిపై తీవ్ర చర్చ నడుస్తున్న నేపథ్యంలో… షరిళ ఎంట్రీ ఇచ్చారు.

అవును… ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడులు, అత్యాచారాలు, హత్యలు పేరిగిపోతున్నాయని… వైసీపీ కార్యకర్తలే లక్ష్యంగా ఈ దారుణాలు చోటుచేసుకుంటున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో తమ బాధను, ఆవేదనను ఢిల్లీ వేదికగా వినిపించాలని నిర్ణయించారు. దీనిపైనా వైఎస్ షర్మిళ విమర్శలు చేస్తుండటం గమనార్హం.

ఈ మేరకు తాజాగా మైకుల ముందుకు వచ్చిన షర్మిళ… కార్యకర్తల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తానని చెబుతున్న జగన్… ప్రత్యేక హోదా కోసం ధర్నాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కార్యకర్తలే ముఖ్యమా మీకు అని నిలదీశారు. ఈ రోజు మాత్రం మీ కార్యకర్తను చంపేశారని ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తానంటున్నారు.. మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు ఢిల్లీ వెళ్లి ఎందుకు ధర్నా చేయలేదు అని షర్మిల ప్రశ్నించారు. దీనికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక వినుకోండలో జరిగింది పొలిటికల్ మర్డర్ కాదు.. వ్యక్తిగత హత్య అని.. మొన్నటి వరకూ ఆ ఇద్దరూ వైసీపీతోనే ఉన్నారు.. అలాంటప్పుడు ఇది రాజకీయ హత్య ఎలా అవుతుందని షర్మిళ ప్రశ్నించారు. వ్యక్తిగత కక్షలతో ఇద్దరు కొట్టుకుని చచ్చిపోతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా.. ప్రజల కోసం మీరు ఎందుకు ఆలోచించరు అని షర్మిళ నిలదీశారు.

దీంతో.. షర్మిళకు సమాధానాలు బలంగా వస్తున్నాయి. ఇందులో భాగంగా.. షర్మిళకు మానసిక ఒత్తిడి ఏమైనా ఉండి, గతం మరిచిపోతున్నారేమో అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఏపీలో (షర్మిల చెబుతున్నట్లు) ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నడిరోడ్డుపై నరికేసుకుంటే ప్రతిపక్షంగా జగన్ స్పందించకూడదా? అని ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య అనంతరం తొలిసారి నిరసన తెలిపింది జగనే అని గుర్తు చేస్తున్నారు!

ఇదే సమయంలో అప్పుడు షర్మిల ఏమి నిరసన తెలిపారో చెప్పాలని సూచించారు. 2024 ఎన్నికల సమయంలో మాత్రమే బాబాయ్ పై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో షర్మిళ చెప్పగలుగుతారా అని నిలదీస్తున్నారు. ఇక 2014 – 19 కాలంలోనే హోదా ను ప్యాకేజ్ చంద్రబాబు తాకట్టు పెట్టినట్లు స్వయంగా బీజేపీ నేతలు చెప్పినట్లు వచ్చిన కథనాలు షర్మిళ చూడలేదా… పోలవరం చంద్ర్బాబుకు ఏటీఎంగా మారిందని మోడీ చెప్పిన మాటలు వినబడలేదా అని నిలదీస్తున్నరు.

ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పూర్తిగా చంద్రబాబుపై ఆధారపడిన నేపథ్యంలో ఆయన్ని నిలదీయడం మానేసి, జగన్ పై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో… షర్మిళకు రాజకీయ పరిజ్ఞానం ఎంత ఉంది అనే సంగతి కాసేపు పక్కనపెడితే… ఏపీలో కాంగ్రెస్ ను మరింత అధఃపాతాళానికి తొక్కేయడానికి షర్మిళ కృషి చేస్తున్నట్లున్నారని.. ఈ విషయం రాహుల్ గాంధీ & కో గ్రహించుకోవాలని సూచిస్తున్నారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి… నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తోటి ప్రతిపక్షం బీజేపీని, అధికార బీఆరెస్స్ ను ఒకేలా ట్రీట్ చేయబట్టే ఫలితాలు అలా పొందారని… అంతే కానీ ఏపీలో షర్మిళ వ్యవహరిస్తున్నట్లు వ్యవహరించి ఉంటే అక్కడ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదని అంటున్నారు. ఆ విషయాలు మరిచిన షర్మిళ… తన తృప్తి కోసం పార్టీని ముంచేస్తున్నారని అంటున్నారు.

జగన్ పై ఇన్ని ప్రశ్నలు సంధించి, ఇన్ని విమర్శలు చేసిన షర్మిళ… ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమిపై మాత్రం సన్నాయి నొక్కులు నొక్కడం గమనార్హం. వినుకొండ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలని.. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని షర్మిళ సున్నితంగా చంద్రబాబుకు సూచించారు! అంతేతప్ప… నలుగురు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగిన విషయాలపై కానీ.. అందులో ముగ్గురు బాలికలు మృతి చెందిన వ్యవహారంపై కానీ షర్మిల స్పందించలేదు.

ఇక నంద్యాల జిల్లాలోని 8 ఏళ్ల బాలిక మృతదేహం ఇంకా లభ్యం కాలేదనే విషయంపైనా ఆమె రియాక్ట్ కాలేదు. దీంతో… బహుశా ఆమెకు సమాచారం లేదేమో, పవన్ లా ఆమె పేపర్ చూసి తెలిసుకోలేదేమో అని పలువురు కామెంట్ చేస్తుండగా… వాటిపై రియాక్ట్ అవ్వమని ఆదేశాలు అందలేదేమో అని మరొకరు స్పందిస్తున్నారు. ఏది ఏమైనా… షర్మిళ మార్కు రాజకీయాలు ఆమెపై ఉన్న గౌరవాన్ని, ఆమె స్థాయిని మరింత తగ్గించేస్తున్నాయడంలో సందేహం లేదనేది బలంగా వినిపిస్తున్న మాటగా ఉంది!