వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకు వైఎస్ షర్మిల పని చేస్తున్నారా.? లేదంటే, నిజంగానే ఆమె వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నారా.? అన్న మీద చెల్లెలి విమర్శల వెనుక అసలు కోణమేంటి.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే బిగ్ జీరో.! ఇది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీకి వున్న సంప్రదాయ ఓటు బ్యాంకు ఎప్పుడో వైసీపీకి వెళ్ళిపోయింది. అది తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది దాదాపు అసాధ్యం. కానీ, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చన్నదాన్నీ కొట్టిపారేయలేం.
వైసీపీని డ్యామేజ్ చేయడానికే.. అన్నట్లు వైఎస్ షర్మిల వ్యాఖ్యలుంటున్నాయి. అదే సమయంలో వైసీపీకి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని బాగానే ఉపయోగపడుతున్నాయ్.! ‘క్రైస్తవుడైన వైఎస్ జగన్’ అంటూ, జగన్ ఏ మతస్తుడన్నదానిపై వైఎస్ షర్మిల సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇది వైసీపీకి ఉపయోగమే.! క్రైస్తవ ఓటు బ్యాంకు వైసీపీకి అంటిపెట్టుకుని వుండిపోతుంది.
మరి, హిందూ ఓటు బ్యాంకు వైసీపీకి దూరమవదా.? అంటే, ఆ ఈక్వేషన్ మళ్ళీ వేరేలా వుంటుంది. రాజకీయంగా క్రైస్తవ ఓటు బ్యాంకు, టీడీపీ ఓటు బ్యాంకు వేర్వేరు. హిందూ ఓటు బ్యాంకులో ఐక్యత తక్కువ. దానికి చాలా కారణాలున్నాయ్. కులం, ప్రాంతం.. ఇలాంటివన్నీ వుంటాయ్.
అయితే, ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేనే లేరు’ అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేయడం వైసీపీకి చాలా పెద్ద దెబ్బ.
వై అంటే వైవీ సుబ్బారెడ్డి.. ఎస్ అంటే సాయి రెడ్డి ( విజయసాయిరెడ్డి), ఆర్ అంటే రామకృష్ణ (సజ్జల రామకృష్ణారెడ్డి) అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సరికొత్తగా షర్మిల అభివర్ణించిన తీరు, వైసీపీలో చాలామందికి ‘ఇది నిజమే కదా’ అన్న భావన కలిగించింది. ప్రత్యేకించి ఆ ముగ్గురి బాధితులూ షర్మిల వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.
ఇంతకీ, షర్మిల వ్యూహం వైసీపీని దెబ్బ కొట్టడమేనా.?