ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ప్రజలపై ఎన్నో సమీకరణాలు ప్రయోగించవచ్చు కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ప్రజలపై ఎలాంటి వివక్షలు లేకుండా సేవలు అందించాలన్న మహోన్నత స్వభావము కలిగిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజేయ కల్లం వ్యాఖ్యానించారు. మంగళవారం గుంటూరులోని హిందూ ఫార్మశీ కళాశాల ఆడిటోరియంలో ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
కార్యక్రమంలో తొలుతగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపంగా కొద్దిసేపు మౌనం ప్రకటించారు. అనంతరం మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన అతిథులతో జ్యోతిప్రజ్వలనగావించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. అజేయ కల్లం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దివంగత వైఎస్సార్ సంక్షేమ పాలకుడని, సుపరిపాలనా సేవకుడని కొనియాడారు.
క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను అర్థం చేసుకుని, అధినేతగా అధికారాన్ని అందుకోవడానికి ముందు, ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేసిన నాయకుడు వైయస్సార్ అని కీర్తించారు. 1997లో ఏపీలో ఏడువేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం అప్పులు పెరిగిపోవడమేనని… విద్య, వైద్యం, సాగునీటి సమస్యలేనని తాము అప్పట్లో నివేదిక అందజేసినట్లు గుర్తుచేశారు. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్ మెంట్ రూపకల్పన దివంగత వైఎస్ఆర్ చేతులమీదుగా జరిగాయని వివరించారు. ప్రజల సమస్యలను అర్ధం చేసుకొని వాటి పరిష్కారం కోసం పథకాలను ఏర్పాటు చేస్తూ, సమస్యల పరిష్కార వైద్యుడిగా రాజశేఖర్ రెడ్డి పేరు పొందారని అజయ్ వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా రాజశేఖర్ రెడ్డి చర్యలు తీసుకునే వారని, నిత్యం ప్రజల క్షేమం కోసం అంతలా తాపత్రయ పడే నాయకుడిని తెలుగు నేల ఇప్పటి వరకు చూడలేదని, ప్రజల కష్టాల పరిష్కరం కోసం ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేవారని వెల్లడించారు. ఆయన లేని లోటు ఎప్పటికి పొడ్చలేనిదని కొనియాడారు.