మొదటి పంచ్ మనదైతే ఆ లెవల్ వేరుగా ఉంటుందనే ఫార్ములాను జగన్ ఇన్నాళ్లు ఫాలో అవుతూ వచ్చారు. విషయం ఏదైనా సరే ముందు మాట తనదై ఉండేలా చూసుకునేవారు. అదే ఆయన్ను ప్రత్యేకంగా నిలుపుతూ వచ్చింది. సంక్షేమ పథకాలు కావొచ్చు, తీసుకుంటున్న నిర్ణయాలు కావొచ్చు.. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా పాలన చేస్తూ వచ్చారు జగన్. ఎన్నికల్లో ఆయను సంపూర్ణంగా నమ్మిన జనం ప్రతి విషయంలో ఆయన మొదటగా స్పందించి చెప్పే మాటలను నమ్ముతూ వచ్చారు. ఏదైనా అంశంలో ఒకసారి జగన్ మాట్లాడి తన వెర్షన్ చెప్పేశాక ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ఫీట్లు చేసినా ఫలితం ఉండేది కాదు. ప్రత్యర్థుల ఎత్తులను ముందుగానే పసిగట్టి జగన్ చెప్పేయడం తర్వాత విపక్షాలు వాటినే అమలుచేయడం చూసి జగన్ ముందే చెప్పాడు వీళ్ళు ఇలాగే చేస్తారని అనుకుంటూ లైట్ తీసుకునేవారు.
అప్పట్లో ఆయన టైమింగ్ అలా ఉండేది మరి. అదే ఇప్పుడు తప్పింది. అందుకే ఆలయాల మీద దాడుల విషయంలో జగన్ సర్కార్ మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చేశారు అనే విషయాన్ని సీఐడీ తెలుస్తుంది. కాబట్టి దాన్ని పక్కనబెడితే వివాదాన్ని గాలివానలా మార్చింది ప్రతిపక్ష పార్టీలే. అందుకు వెసులుబాటు ఇచ్చింది జగనే అనాలి. అంతర్వేది రథం దగ్ధం, దుర్గ గుడిలో సింహాలు మాయమవడం, అనేక గుళ్ళలో విగ్రహాలను విరగ్గొట్టడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ప్రభుత్వం ఆలస్యంగానే రియాక్ట్ అయింది. బీజేపీ, టీడీపీలు ఆ వివాదాలను రాజకీయ చేసేందుకు అది బాగా ఉపకరించింది.
మొదటి దాడి జరిగినప్పుడే జగన్ రియాక్షన్ బలంగా ఉంది ఉంటే వ్యవహారం ఇక్కడి వరకు వచ్చేదే కాదు. అన్ని విషయాల్లో ఎలాగైతే ప్రత్యర్థులు తోకముడిచారో ఈ విషయంలోనూ అలాగే జరిగేది. రామతీర్థం ఘటనలో కూడ ప్రతిపక్షాలు పూర్తిగా లీనమయ్యేదాకా జగన్ మౌనంగానే ఉన్నారు. అన్ని పార్టీలు కొండ మీదకు వెళ్లి హంగామా చేసేసి, ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసిన తర్వాత జగన్ రియాక్ట్ అయ్యారు. ఇంటింటికీ అనేక సంక్షేమ ఫలాలు అందిస్తుంటే.. జీర్ణించుకోలేక, తట్టుకోలేక దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారు. సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ప్రజలకు ఎన్నో సేవలందుతుంటే ఏం చేయాలో తోచక విగ్రహాల విధ్వంసానికి ఒడిగడుతున్నారని అన్నారు.
రాష్ట్ర రాజకీయ గెరిల్లా వార్‌ఫేర్ జరుగుతోందని, రాజకీయ దురుద్దేశాలతో గుళ్లపై దాడులు చేస్తున్నారని, దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామని, విగ్రహాల ధ్వంసంలో ఎవరినీ లెక్క చేయొద్దని చెప్పారు. ఎవరినీ వదిలిపెట్టొద్దని కలెక్టర్లు, ఎస్పీలతో అన్నారు. ఇది అల్లాటప్పా వార్నింగ్ కాదు. చాలా బలమైంది. కానీ టైమింగ్ మిస్ కావడం వలన చూపాల్సిన రీతిలో ప్రభావం చూపట్లేదు. అదే రామతీర్థం ఘటన వెలుగు చూసిన కొన్ని గంటల్లో సీఎం ఈ మాటలు అని ఉంటే ప్రత్యర్థులకు ఇన్ని కొమ్ములు వచ్చేవే కావు, ఇంత రాజకీయం జరిగేదే కాదు.