తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ గెలుపులో టీడీపీ పాత్ర ఉందని చెప్పుకుంటున్న తమ్ముళ్లు కొందరు.. ఏపీలో కూడా మంచిరోజులు రావొచ్చనే ఉత్సాహంతో ఉన్నారు. పైగా తెలంగాణలో జనసేన పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి.. పెద్దగా సీట్లు త్యాగం చేయనవసరం లేదని కొంతమంది నాయకులు భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో టీడీపీ ఓటు బ్యాంకే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.
వాస్తవానికి టీడీపీ కమ్మ సామాజికవర్గం వారి పార్టీ అని రాజకీయ వ్యాఖ్యలు ఉన్నప్పటికీ… ఆ పార్టీకి మొదటినుంచీ వెన్నుముకగా నిలిచింది బలమైన బీసీ సామాజికవర్గ ప్రజలే అనేది తెలిసిన విషయమే. ఆ పార్టీ ఆవిర్భవించినప్పటినుంచీ బీసీలే బలంగా ఆ పార్టీ ముందుకు పోతుంది. ఇక కాంగ్రెస్ ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్ల ఓటు బ్యాంకును వైసీపీ ఓన్ చేసుకుంది. ఈ సమయంలో 2019 మాదిరి అత్యధిక సీట్లలో ప్రభావం చూపించాలంటే టీడీపీ ఓటు బ్యాంకును పూర్తిగా ఓన్ చేసుకునే దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇందులో భాగంగా ఇప్పటికే అటు మంత్రివర్గంలోనూ, ఇటు నామినెటెడ్ పోస్టుల లోనూ ఎస్సీలతోపాటు బీసీలకు పెద్ద్ద పీట వేసిన జగన్… రాబోయే ఎన్నికల్లోనూ బీసీలకు అత్యధిక స్థానాలు కట్టబెట్టాలని చూస్తున్నారని స్పష్టమవుతుంది. అందుకు సిట్టింగుల పెర్ఫార్మెన్స్ లో లోపాలను చూపిస్తున్న సర్వేలే కారణామా.. లేక, సామాజిక సమీకరణాలే ప్రధాన కారణామ అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. తాజాగా జగన్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఆ సంకేతాలే అందిస్తున్నాయి.
ఒకే రోజున వైసీపీకి రెండు ఎదురుదెబ్బలు తగిలాయనే చెప్పుకోవాలి. అందులో ప్రధానంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆల్ల రామకృష్ణారెడ్డి, గాజువాక నుంచి తిప్పల దేవన్ రెడ్డి రాజీనామాలు చేశారు. ఇది అత్యంత కీలక పరిణామంగా చెబుతున్నారు. అయితే ఈ రెండు చోట్లా రెడ్లను పక్కనపెట్టి బీసీలకు పెద్దపీట వేయాలని జగన్ భావించడమే వారి రాజినామాలకు కారణం అనే చర్చ ఆయా నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ బలంగా వినిపిస్తుంది.
వాటికి బలం చేకూరుస్తూ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మంగళగిరిలో బీసీ నేత గంజి చిరంజీవిని ఇన్ ఛార్జ్ చేశారు. ఆ నియోజకవర్గంలో చేనేతలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ పద్మశాలీలకే ఆ స్థానం కేటాయించాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో… ఇప్పటికే ఆ సామాజికవర్గంలోని కీలక నేతలను పార్టీలో చేర్చుకుని పదవులు కట్టబెట్టిన జగన్… ఇప్పుడు ఆ స్థానానికి ఇన్ ఛార్జ్ ని అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి కట్టబెట్టారు.
ఇదే సమయంలో గాజువాకలో బీసీ వర్గానికి చెందిన వరికూటి రామచంద్రరావును నియమించారు. ఈ క్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినిని నియమించగా.. ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా కాపు సామాజిక వర్గానికి చెందిన మల్లెల రాజేష్ నాయుడిని నియమించారు. దీంతో బీసీలే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారని స్పష్టమవుతుందని అంటున్నారు పరిశీలకులు.
ఇలా కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సింహభాగం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి రాజ్యాధికారంలో వాటా కల్పించి సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్న వైసీపీ నేతలు… ఈ విషయంలో జగన్ నిర్ణయాలను స్వాగతిస్తున్నారని తెలుస్తుంది. దీంతో… ఈ సమయంలో టీడీపీ – జనసేనలు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. పాజిటివ్ ఓటు బ్యాంకును నమ్ముకుంటే బెటరని సూచిస్తున్నారు.
మరి టీడీపీకి వెన్నెముఖగా ఉన్న బీసీలకు వైఎస్ జగన్ ఈ స్థాయిలో పెద్ద పీట వేస్తున్న తరుణంలో… ఇక టీడీపీ వారిని ఏస్థాయిలో అందలం ఎక్కిస్తుంది.. ఎన్ని అధిక సీట్లు ఇస్తుంది అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా… ఈసారి బీసీలు కేంద్రంగా ఏపీలో ఎన్నికలు కీలకంగా నడిచే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు!