జయము జయము చంద్రన్న.! అసెంబ్లీలో వైఎస్ జగన్ ర్యాగింగ్.!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ‘జయము జయము చంద్రన్నా..’ అంటూ నినదించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సెటైరికల్ కోణంలోనే లెండి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు హయాంలో జరిగిన తప్పిదాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. కొన్ని ఫొటోల్ని, వీడియోల్ని సభలో ప్లే చేశారు.

చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేసిన చంద్రబాబు అండ్ టీమ్ మీద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. టీడీపీ అనుకూల మీడియా మీద కూడా వైఎస్ జగన్ ఛలోక్తులు నడిచాయి. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాలే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవడానికి కారణమన్నది వైఎస్ జగన్ ఆరోపణ.

పోలవరం ప్రాజెక్టు పేరుతో ఎన్నో దశాబ్దాలుగా పబ్లిసిటీ స్టంట్లు నడుస్తున్నాయి. వైఎస్ హయాంలో జలయజ్ఞంతో నడిచిందీ పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. చంద్రబాబు హయాంలోనూ అలాగే జరిగింది. వైఎస్ జగన్ హయాంలోనూ అదే జరుగుతోంది. ఇకపైన కూడా అదే కొనసాగేలా వుంది.

నిజానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ‘జయము జయము చంద్రన్నా..’ అని సెటైర్లు వేసే బదులు, ప్రధాని నరేంద్ర మోడీ మీద కామెంట్లు వేసి వుంటే బావుండేదేమో.! ఎందుకంటే, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదే అయినా, సకాలంలో నిధులు విడుదల చేయాల్సింది కేంద్రం.

ఆర్థిక మంత్రి, జల వనరుల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి.. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి విజ్ఞప్తులు అందుతూనే వున్నాయ్.. అధికారులూ కేంద్రానికి పోలవరం ప్రాజెక్టు విషయమై నివేదికలు ఇస్తూనే వున్నారు. కానీ, పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగడంలేదు. సాగండంలేదంటే, అక్కడ పనులు జరుగుతున్నాయ్.. చంద్రబాబు హయాంలోనూ, వైఎస్ జగన్ హయాంలోనూ సాగుతూనే వున్నాయ్.

పోలవరం ప్రాజెక్టు ఫైనల్ బడ్జెట్ అంచనాలెంత.? కేంద్రం ఇవ్వాల్సిందెంత.? ఇచ్చిందెంత.? అన్నదానిపై సభలో లెక్కలు చెప్పి, కేంద్రాన్ని వైఎస్ జగన్ సర్కారు నిలదీస్తే ప్రయోజనం తప్ప, ‘జయము జయము చంద్రన్నా..’ అని నినదిస్తే ఏం లాభం.? అది టీడీపీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో జాకీలేసే వ్యవహారం కాకపోతే.!