వైఎస్ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒక్కొక్కదాన్ని ఆచరణలో పెడుతూ వస్తున్నారు. ఖజానా ఖాళీగా ఉన్నా అప్పులు చేసిన సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. అమ్మ ఒడి నుండి జగనన్న విద్యా కానుక వరకు పలు పథకాలు నడుస్తున్నాయి. మహిళలో ఖాతాల్లో ఏడాదిలో విడతల వారీగా డబ్బు జమవుతూ ఉంది. మొదటి ఏడాదిలో ఈ పనిని విజయవంతంగా చేసిన జగన్ రెండో ఏడాదిలో వేగం మరింత పెంచారు. కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. వాటిలో ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కూడ ఒకటి. ముందుగా అనుకున్న ప్రకారం ఈ పంపిణీ ఇదివరకే మొదలవ్వాల్సి ఉంది. కానీ వాయిదాపడుతూ వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగైతే నెలల తరబడి వెనక్కు వెళుతున్నాయో ఇవి కూడ అలాగే వెళుతున్నాయి.
నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ చేసుకునే ఈ ఉచిత ఇళ్ల స్థలాలను పంచాలని జగన్ భావించారు. కానీ ఈసీ మూలంగా ఎలక్షన్లు వాయిదాపడ్డాయి. వాటితో పాటే వరుస కోర్టు కేసులతో పట్టాల పంపిణీ కూడ జరగలేదు. పేదలకు ఇల్లు ఇస్తామంటే టీడీపీ అడ్డుపడుతోందని జగన్ సహా వైసీపీ నేతలంతా ఆరోపిస్తూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్థి హక్కుతో పట్టాలు ఇస్తామని శపథం చేశారు. కానీ చివరికి ఆస్తి హక్కును పక్కనపెట్టి డీ-పట్టాల ద్వారానే పంపిణీని స్టార్ట్ చేయనుంది. అంతేకాదు వివాదాల్లో ఉన్న కొద్దిపాటి భూమిని వదిలేసి మిగతా భూమిని పంచనున్నారు. టీడీపీ హయాంలో కట్టిన టిడ్కొ ఇళ్లను సైతం లబ్దిదారులకు అందించనున్నారు. ఇన్ని నెలలు ప్రతిపక్షం అడ్డుపడుతోంది, పేదలు బాగుపడటం వారికి ఇష్టం లేదు. మోకాలడ్డితే పనులెలా చేయాలి అంటూ కేసులుంటే పట్టాల పంపిణీ సాధ్యంకాదన్న తరహాలో మాట్లాడిన పాలక పక్షం ఉన్నపళంగా డిసెంబర్ 25న పంపిణీకి శ్రీకారం చుట్టింది.
దీన్నిబట్టి ప్రభుత్వం మొదట్లోనే సర్దుకుని ఉంటే ఈపాటికే పట్టాలు పేదల చేతికి అందేవి. ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యేవి. కానీ జరగలేదు. ఇప్పుడు మాత్రం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సర్కార్ హడావుడిగా ఈ నిర్ణయం తీసుకుందనే అనుకోవాలి. ఎందుకంటే నిమ్మగడ్డ ఈసీగా ఉన్నంత కాలం ఎన్నికలు జరపదు ప్రభుత్వం. మార్చి నాటికి నిమ్మగడ్డ రిటైర్ అయిపోతారు. అప్పుడు ఎలాంటి సమస్య లేకుండా ఎలక్షన్లు పెట్టుకోవచ్చు. అయితే ఈలోపు ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. అలా రావాలంటే సంక్షేమం పెద్ద ఎత్తున జరగాలి. ప్రజలు మార్చి నాటికల్లా భారీ లబ్దిని పొందాలి. అప్పుడే ఎన్నికల్లో మంచి మైలేజ్ సాధ్యమవుతుంది. అందుకే డిసెంబర్ 25 నుండి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం మొదలుపెడుతున్నటు అనిపిస్తోంది.
ఈ కార్యక్రమం చాలా పెద్దది. మొదటి దశలో 15.6 లక్షల ఇల్లు, రెండో దశలో 12 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తంగా 27 లక్షల ఇళ్ల నిర్మాణం జరపాలి. అలాగే మొత్తం 30 లక్షల మంది పేదల చేతికి భూపట్టాలు అందాలి. దీన్ని ఒక్కరోజులో పూర్తిచేస్తే కుదరదు. ఈ నెల 25 నుండి మొదలయ్యే కార్యక్రమం ఎన్ని దశల్లో ఉంటుందో, ఎప్పటికి వరకు నడుస్తుందో చెప్పలేం. అన్ని జిల్లాల్లోనూ హంగామా జరగాలి. ఈ కార్యక్రమం గురించి ఊరూ వాడ కొన్ని నెలల పాటు మాట్లాడుకోవాలి. అంటే పట్టాలు మెల్లగా లబ్దిదారులకు అందుతాయి. ఇక ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమాల హడావిడి కూడ నెలల తరబడి ఉంటుంది అంటే ఒక్కొక ప్రాంతంలో ఒక్కో రోజున జరిపినా జరుపుతారు. అంటే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు పాలక పక్షం ధూమ్ ధామ్ చేస్తుందన్నమాట. ఎన్ని రోజులు చేసినా, ఎందుకోసం చేసినా పేదలకు పట్టాలు, ఇల్లు అందితే చాలు.