పోలవరంను పరుగులు పెట్టించింది నేనే. నేను లేకపోతే పోలవరం లేదు. మా హయాంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయి. పోలవరానికి ముంపు మండలాలను వెతికి పెట్టింది నేనే. కేంద్రం పట్టించుకోకపోతే సొంత నిధులతో ప్రాజెక్ట్ పనులు చేపట్టాం. ఇది పోలవరం విషయంలో నారా చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు. కానీ వాటన్నింటినీ ఒట్టి అబద్దాలని అంటూ అసెంబ్లీలో గర్జించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇవే అసలు సిసలు వాస్తవాలు అంటూ పోలవరం గురించిన అన్ని లెక్కలను బహిర్గతం చేశారు. పోలవరాన్ని ప్రారంభించింది తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన కుమారుడిగా చెబుతున్నా ప్రాజెక్టును పూర్తి చేసేది కూడ నేనే అంటూ స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రాజెక్ట్ కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు 86 శాతం భూమిని అంటే 10,627 ఎకరకాలను సేకరించారని చెప్పుకొచ్చారు.
2014లో సీఎం అయ్యాక చంద్రబాబుగారు మిగిలిన 14 శాతం అంటే 1700 ఎకరాలను మాత్రమే సేకరించారని, 2005లో కోర్టులో కేసులు వేసి వైఎస్ఆర్ చేపట్టిన భూసేకరణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాగే ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ కోసం వైఎస్ హయాంలో 10,342 ఎకరాలను సేకరించారు. ప్రాజెక్ట్ కోసం అవసరమైన అనుమతులన్నీ తీసుకొచ్చారు. చంద్రబాబు తన హయాంలో కేవలం 29 శాతం పనులు మాత్రమే చేశారని అంటూ అంతకంటే ముందే 30 శాతం పనులు పూర్తయ్యాయని, అంటే మొత్తంగా ఇప్పటివరకు 60 శాతం పనులు ముగిశాయని క్లారిటీ ఇచ్చారు. ఈ లెక్కలతో పాటే మిగిలిన 40 శాతం పనులను రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా పూర్తిచేయగలిగేది తానేనని ప్రకటన చేశారు.
జగన్ చేసిన ఈ వీరోచిత ప్రకటనతో అసెంబ్లీ మొత్తం సినిమా థియేటర్లా దద్దరిల్లిపోయింది. సభలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలంతా హర్షద్వానాలతో ముఖ్యమంత్రిని కీర్తించారు. జగన్ స్పీచ్ కు అసెంబ్లీలోనే కాదు బయట జనంలో కూడ మంచి స్పందనే వస్తోంది. పోలవరం పూర్తవుతుందో లేదో, ముంపు మండలాలకు పరిహారం అందుతుందో లేదో అని కంగారుపడుతున్న జనంలో జగన్ మాటలతో ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటివరకు జగన్ చెప్పిన ప్రతి పనినీ చేసి చూపించారు. ఇంకొన్నింటినీ చేసే పనిలో ఉన్నారు. దాంతో పోలవరాన్ని కూడ జగన్ చెప్పినట్టే చేసి చూపిస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిచేయాలంటే ఇంకా 37,883 కోట్లు కావాలన్న జగన్ కేంద్రం సానుకూలంగా స్పందిస్తోందని, అనుకున్నట్టే 2022 ఖరీఫ్ సీజన్ నాటికి ప్రాజెక్ట్ పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తొలుత రివర్స్ టెండర్లు పిలిస్తే రూ.1,142 కోట్లు ఆదా అయ్యాయి. రివర్స్ టెండరింగ్ విధానంలో ఆ తర్వాత చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో మరో రూ.201 కోట్లు ఆదా అయ్యాయి. ఆ రెండూ కలిపితే అక్షరాలా రూ.1,343 కోట్లు పోలవరం పనుల్లో ఆదా అయ్యాయని, ఈ లెక్కలే చంద్రబాబుగారి హయాంలో జరిగిన అవినీతికి సాక్ష్యాలని అన్నారు. ఇలా జగన్ వరుసపెట్టి లెక్కలు చెబుతుంటే కూర్చొని వింటుండటం తప్ప టీడీపీ నేతలు ఏమీ చేయలేకపోయారు.