తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఛాన్నాళ్లుగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడుతున్నారు. ఎన్నాళ్ళ నుండో థర్డ్ ఫ్రంట్ పెట్టి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలని ఆయన భావిస్తున్నారు. ఇది జరగాలంటే కొన్ని పెద్ద రాష్ట్రాల మద్దతు కేసీఆర్ కు అవసరం. ఆ మద్దతును కూడగట్టుకోవడం కోసం ఆయన గతంలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. కానీ అవేవీ గొప్ప ఫలితాన్ని ఇవ్వలేదు. ఎవ్వరూ ఆయనకు బలమైన హామీ ఇచ్చినట్టు కనబడలేదు. దీంతో థర్డ్ ఫ్రంట్ పనులను వాయిదా వేసుకున్న ఆయన మళ్ళీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. జమిలి ఎన్నికలు రానున్నాయనే వార్తల నేపథ్యంలో మళ్లీ హోమ్ వర్క్ స్టార్ట్ చేశారు. మొన్నామధ్యన వచ్చిన కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ పేరు నయా భారత్ వార్తలు కేసీఆర్ వర్గం ఇచ్చిన లీకులనే అంటున్నారు కొందరు.
సరే.. లీకులు ఇచ్చినా ఇవ్వకపోయినా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనలో అయితే ఉన్నారన్నది మాత్రం వాస్తవం. ఆయన ఆలోచన వెనుక ప్రేరణలు, ఉద్దేశ్యాలు, లక్ష్యాలు ఏవైనా, ఎవరైనా అసలు కేసీఆర్ తాను అనుకుంటున్నట్టు తన జాతీయ పార్టీ కోసం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టగలరా, ఆయనతో కలిసి నడిచేది ఎవరు అనేదే పెద్ద ప్రశ్న. కొందరు విశ్లేషకులు చెప్పడం మాత్రం ఇతర రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్న జాతీయ పార్టీలను తనవైపుకి తిప్పుకోవడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. కిందా మీదా పడి ఈరోజు వారిని ఒప్పించినా రేపు మద్దతు ఉపసంహరించుకుంటున్నాం అనవచ్చు. అసలు కూటమి సారథిగా మీరే ఎందుకు ఉండాలి.. మీకంటే ఎక్కువ ఎంపీ స్థానాలు మా పార్టీకే ఉన్నాయి కాబట్టి నా నాయకత్వంలో కూటమి ఎందుకు నడవకూడదు అని కొందరు అనొచ్చు.
ఉదాహరణకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే తీసుకోండి. ఆమె పార్టీకి అక్కడ 42 ఎంపీ స్థానాలున్నాయి. వాస్తవంగా మాట్లాడుకుంటే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కంటే మమతా బెనర్జీ ప్రభావమే ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి ఆమే అడ్డం తిరిగి పగ్గాలు తన చేతికివ్వమని అడిగినా ఆశ్చర్యం లేదు. అలాగే ఒడిశా సీఎం నితీష్ కుమార్, తమిళనాడుకు చెందిన బీజేపీ వ్యతిరేక నాయకుడు స్టాలిన్. ఇలా వీరంతా కేసీఆర్ కంటే బలమైన నాయకులే. వీరిలో ఎవరు అడ్డం తిరిగినా కేసీఆర్ ఆశలు గల్లంతే. కానీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం అలా కాదు. కేసీఆర్ తో ఆయనకు మంచి దోస్తీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మద్దతు తనకు ఉంటుందనే నమ్ముతున్నారు కేసీఆర్. జగన్ కూడ బీజేపీని నొప్పించి అయినా కేసీఆర్ పక్షం వహించే అవకాశం లేకపోలేదు. సో.. ఇప్పటికిప్పుడు చూసుకుంటే కేసీఆర్ కు కొండంత అండగా నిలిచేది ఎవరూ అంటే అది జగన్ మాత్రమేనని అనుకోవాలి.