జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పోటీచేసిన రెండు స్థానాల్లో ఓడిపోగా ఆ పార్టీ తరపున రాపాక వరప్రసాదరావు ఒక్కరే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఆయన రాష్ట్రం మొత్తం పాపులర్ అయ్యారు. పార్టీ తరపున పవన్ కంటే ముందు అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారని జనసేనలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కానీ సీన్ మొత్తాన్ని నాలుగైదు నెలల్లోనే మార్చేశారు రాపాక. అసెంబ్లీలో మెల్లగా ప్రారంభించి జగన్ కు పూర్తిగా మద్దతివ్వడం స్టార్ట్ చేశారు. ఆయన పాలనకు భజన కార్యక్రమం షురూ చేశారు. ఆ భజన అసెంబ్లీ దాటి రాజోలు రోడ్ల మీదకు చేరింది. రాజోలులోని ప్రతి సెంటర్లో జగన్ బొమ్మలకు పాలాభిషేకాలు చేశారు ఆయన. ఇదంతా చూసి జనసేన షాకైంది. గెలిచిన ఒక్కడూ ఇలా ప్లేట్ పిరాయించాడేమిటి పవన్ సహా శ్రేణులంతా అనుకున్నారు.
రాపాక అసెంబ్లీలో పార్టీ స్టాండుకు వ్యతిరేకంగా జగన్ కు మద్దతిచ్చి జనసైనికులకు మరింత మండేలా చేశారు. దీంతో ఆయన మీద ఆశలు వదిలేసుకున్నారు వారు. ఇక రాజోలు వైసీపీలో రాపాక ఎంట్రీతో ముసలం మొదలైంది. అప్పటికే వైసీపీలో రెండు వర్గాలు కొట్టుకుంటుంటే రాపాక తనది మూడవ వర్గం అంటూ చేరి ఇప్పుడు తనదే ప్రధాన వర్గం అనే స్థాయికి వెళ్లిపోయారు. వైసీపీ నేతలకంటే ఎక్కువగా పార్టీ పెద్దలను కలుస్తూ జగన్ వద్ద మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన అతి వినయం చూసిన స్థానిక వైసీపీ నేతలు మా నాయకుడికి మేము కూడ ఇంత భజన చేయలేదే, దీని వెనుక ఏదో పెద్ద స్కెచ్ ఉందని అనుమానపడ్డారు. రాపాక వైసీపీలో స్థానాన్ని మించి ఇంకేదో ఆశిస్తున్నారని అనుకున్నారు.
వాళ్ళు అనుకున్నట్టే జరిగింది. భజన చేసి చేసి అలసిపోయారో లేకపోతే చేసింది చాలు ఇక ఓపెన్ అయిపోదామని అనుకున్నారో కానీ తన కోరికను వైసీపీ పెద్దల ముందు ఉంచారట ఆయన. ఇప్పటికే రాపాక కుమారుడు రాపాక వెంట్రామయ్య వైసీపీలో చేరి ఉన్నారు. వచ్చే ఎన్నికలకు అతన్ని ఎమ్మెల్యేను చేయాలనేది రాపాక కోరిక. జనసేనలోనే ఉంటే టికెట్ మళ్ళీ రాపాక చేతికే వెళ్ళేది. కానీ గత ఎన్నికల్లోనే వెయ్యి లోపు ఓట్లతో ఎలాగో బయటపడ్డాం, మళ్లీ వచ్చేసారి గెలుపంటే కష్టమనుకున్నారు ఆయన. అందుకే వైసీపీ జట్టు కట్టి కుమారుడి భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలో ఉన్నారు.
ఇటీవల ఆయన వచ్చే ఎన్నికలో తన కుమారుడికి రాజోలు టికెట్ ఇవ్వాలని పెద్దలను కోరారట. అంతేకాదు స్థానిక వైసీపీలో వర్గపోరు నడుస్తోందని, తాను మాత్రమే పార్టీని నడపగలనని చెబుతూ కుమారుడికి టికెట్ కేటాయిస్తే గెలుచుకొచ్చే భాద్యత తనదని మాటిచ్చారట. దీంతో వైసీపీ నేతలైన బొంతు రాజేశ్వరరావు, పెద్దపాటి అమ్మాజీ ఖంగుతిని రాపాకకు టికెట్ ఇస్తే ఒప్పుకునేదే లేదని, ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడిన తమను విస్మరిస్తే పరిస్థితులు మారిపోతాయని నేరుగానే ఇండికేషన్స్ ఇచ్చేశారట. చూడబోతే రాపాక మూలాన రాబోయే రోజుల్లో రాజోలు జగన్ కు సమస్యలా తయారయ్యే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.