వైఎస్ జగన్ ఎప్పుడెప్పుడు దొరుకుతారా, ఆయన మీద విరుచుకుపడిపోదామా అని విలపక్షాలు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాయి. ఏ చిన్న పాయింట్ దొరికినా రాద్ధాంతం చేసేస్తున్నాయి. ఇలాంటి టైంలో జగన్ సర్కార్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అలా కనిపించట్లేదు. స్వయంగా ప్రత్యర్థుల చేతికి చిక్కేలా ఉంటున్నాయి. ఇప్పటికే దేవాలయాలు, దేవుళ్ళు, మతాల విషయంలో విపక్ష పార్టీలు జగన్ మీద బురద చల్లే పనిని చేస్తున్నాయి. దేవాలయాల మీద దాడుల వివాదాన్ని బీజేపీ ఎంత రాద్ధాంతం చేసిందో అందరికీ తెలుసు. అదృష్టవశాత్తు అవేవీ పెద్దగా పనిచేయలేదు.
కానీ తాజాగా దేవాదాయశాఖ తీసుకున్న నిర్ణయం ఒకటి విమర్శలకు కావాల్సినంత చోటిస్తున్నట్టు కనిపిస్తోంది. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకల సందర్బంగా రాష్ట్రంలో ఉన్న పలు ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాదాయ అదనపు కమీషనర్ ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు అరసవెల్లి నుండి అంతర్వేది వరకు ఉన్న పలు దేవాలయాల్లో ఈ నెల 18న స్వరూపానందేంద్ర పుట్టినరోజు వేడుకలకు ప్రత్యేక పూజలు, మర్యాదలు నిర్వహించనున్నారు. కొద్దిరోజుల క్రితం విశాఖ శారద పీఠం మేనేజర్ రాసిన లేఖకు స్పందించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గతంలో ఎన్నడూ ఇలాంటి సంప్రదాయాన్ని ప్రభుత్వాలు అమలుచేయలేదు.
శారద పీఠానికి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. స్వరూపానందేంద్ర స్వరస్వతి స్వయం ప్రకటిత పీఠాధిపతే కానీ ఆయన్ను ప్రభుత్వం ఎంపిక చేయలేదు. కాబట్టి ఆయనకు, ప్రభుత్వనికి మధ్యన లాంఛనాలు ఉండవు. అయినా ఆయనకు దేవాలయాల్లో మర్యాదలు, ఆయన కోసం ప్రత్యేక పూజలు జరగాలని ఆదేశాలివ్వడం చిత్రమే. స్వరూపానందేంద్ర సరస్వతి అంటే జగన్ కు వల్లమాలిన అభిమానం, భక్తి. ఆయన్ను ఒక రాజగురువులా చూస్తుంటారు జగన్. తాను అధికారంలోకి రావడానికి స్వరూపానందేంద్ర ఆశీస్సులు కూడ ఒక కారణమని భావిస్తుంటారు.
అయితే అదంతా వైఎస్ జగన్ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు,అభిరుచులు, అభిప్రాయాలకు సంబంధించిన విషయం. కానీ ఇప్పుడు ఆయనొక ముఖ్యమంత్రి. సీఎం హోదాలో తన సొంత అభీష్టాలకు వెళ్లడం ఎంతవరకు సమంజసమో వారే ఆలోచించుకోవాలి. ఈ విషయం మీద ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. ఇలాంటి విపరీత ధోరణిని ఇంతవరకు చూడలేదని, సొంత ఇష్టాలతో దేవాలయాల సంప్రదాయాలను మార్చేస్తారా, గురుభక్తి అనేది మీ సొంత విషయం అంటూ అభ్యంతరాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి అనుమతి లేకుండానే దేవాదాయ శాఖ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోగలదా, ఇదంతా జగన్ ఆదేశాలు మేరకే జరుగుతోంది అంటూ మండిపడుతున్నాయి. మరి ఈ విమర్శలకు ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెబుతారో చూడాలి.