జగన్ వర్సెస్ పవన్.! చంద్రబాబు ఎక్కడ.?

ట్రయాంగిల్ ఫైట్ కాస్తా.. జనసేన – వైసీపీ మధ్య నువ్వా నేనా.? అన్నట్లుగా మారబోతోందా.? తెలుగుదేశం పార్టీ పరిస్థితేంటి 2024 ఎన్నికల్లో.? జనసేన వారాహి విజయ యాత్రతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ఈక్వేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.

నిజానికి, వైసీపీ – టీడీపీ మధ్యనే పోటీ వుండాలి. ఎందుకంటే, ఒకటి అధికార పక్షం.. ఇంకోటి ప్రధాన ప్రతిపక్షం. అసెంబ్లీలో జనసేన ప్రాతినిథ్యం జీరో.! ఒక్కరు వున్నా, వైసీపీలోకి దూకేశారు మరి.! అయితేనేం, వారాహి విజయ యాత్రతో జనసేన పార్టీ మైలేజ్ పెంచుకుంది.

ఇంతకీ, టీడీపీ సంగతేంటి.? తెలుగుదేశం పార్టీ అయితే ఓ వైపు ‘యువగళం’ పాదయాత్ర, ఇంకో వైపు, ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమాలతో జనంలోనే వుంటోంది. చంద్రబాబు, నారా లోకేష్.. ఇద్దరూ జనంలోనే వుంటున్నారు. వైసీపీ – టీడీపీ మధ్య కూడా మాటల యుద్ధం గట్టిగానే జరుగుతోంది.

అయినాగానీ, ప్రధానంగా రాజకీయ విమర్శల పర్వం వైసీపీ – జనసేన మధ్యనే జరుగుతోందన్నది బహిరంగ రహస్యం. వ్యవహారం వ్యక్తిగత విమర్శల స్థాయిని కూడా దాటేసింది. పవన్ కళ్యాణ్ మీద వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలకు, జనసేన నుంచి కౌంటర్ ఎటాక్ అంతే స్థాయిలో.. అంతకు మించిన స్థాయిలో వస్తోంది. వ్యూహాత్మకంగా జనసేనను వైఎస్ జగన్ టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

పార్టీని పణంగా పెట్టి మరీ, వైఎస్ జగన్ ఈ విమర్శలు జనసేన మీద చేస్తున్నారా.? ఏపీ రాజకీయ తెరపైనుంచి టీడీపీని పక్కకు తోసేందుకు జనసేనకు జగన్ మైలేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా.? ఏదైతేనేం, జనసేనలో సీరియస్‌నెస్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.! దానికి వైఎస్ జగన్ విమర్శలే కారణమేమో.!