వైఎస్సార్ కుటుంబానికి కడప జిల్లా అనేది సొంత అడ్డా అని అంటుంటారు. ఇక పులివెందుల నియోజకవర్గం అయితే వైఎస్ ఫ్యామిలీ కంచుకోట అని చెబుతారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీ ఓటమి ఎరిగింది లేదు! ఇక తాజాగా జగన్ విషయనికొస్తే… నామినేషన్ వేసి వస్తే చాలు గెలుపు కన్ ఫాం! ఈ పరిస్థితుల్లో జగన్ ఈ సారి హిందుపురం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు ఆ నియోజకవర్గ కార్యకర్తలు.
జగన్ ను పులివెందుల నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 75,243 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక 2019 వైసీపీ సునామీలో 90,110 ఓట్ల మెజారిటీ సాధించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఇది లక్ష దాటాలని వైసీపీ కార్యకర్తలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపూర్ లో బాలయ్య వరుసగా గెలుస్తున్నారు.. ఆయన్ను మట్టికరిపించాలంటే ఈసారి వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు వైసీపీ కార్యకర్తలు.
అవును… శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ పోటీ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు హిందూపూర్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు. సీఎం వైఎస్ జగన్ హిందూపురం నుండి పోటీ చేయాలని వైసీపీ నాయకుడు నరేష్ ఆధ్వర్యంలో ప్లకార్డులతో ర్యాలీ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి మహిళలతో పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. బాలకృష్ణ సినీ గ్లామర్ తో వరుసగా విజయం సాధిస్తున్నాడని.. ఆయన్ను ఢీకొట్టేందుకు సరైన వ్యక్తులు వైఎస్ ఫ్యామిలీ నుంచి రావాలన్నది వారి వెర్షన్.
అయితే ఇక్కడ వైసీపీ నాయకులు ఒక్క విషయం గ్రహించలేకపోతున్నారు అనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ఈసారి కుప్పంలో చంద్రబాబుని సైతం ఓడించాలని, లోకేష్ ను మరోసారి మట్టికరిపించాలని, పవన్ ను అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదని వైసీపీ ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో… హిందూపూర్ ని కొట్టడం పెద్ద సమస్య కాదనే వెర్షన్ కూడా వినిపిస్తుంది.
ఇక హిందూపూర్ లో బాలకృష్ణ వరుసగా రెండు సార్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఆ రెండుసార్లూ బాలయ్య 10% ఓట్ల మెజారిటీ సాధిస్తూ వస్తున్నారు. ప్రత్యర్థి ఎవరైనప్పటికీ బాలయ్యకు ఈ మెజారిటీనే కంటిన్యూ అయ్యింది. దీంతో ఈసారి బాలయ్యపై సరైన అభ్యర్థిని పెట్టి ఓడించాలని వైసీపీ భారీ స్కెచ్ వేస్తోందని తెలుస్తుంది. ఈ విషయం మరిచిన హిందూపుర్ వైసీపీ నాయకులు ఇలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వడమే ఆశ్చర్యంగా ఉంది.
ఫలితంగా.. జగన్ లెవెల్ తగ్గించేలా హిందూపుర్ వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీని గెలిపించుకునేలా కార్యకర్తలు కష్టపడాలి.. అధినేత సహాయసహకారాలు అడగాలి.. అంతే తప్ప కష్టమైన ప్రతీ నియోజకవర్గంలోనూ జగన్ ని పోటీకి నిలబడమంటే అది నాయకుడి సమర్ధతను సంకించినట్లే అని అంటున్నారు.