ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుందా.? ఆ ముందస్తు ఎన్నికల కోసం ఏప్రిల్ నుంచే ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారా.? రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమైతే లేదు. కానీ, ఎన్నికల ప్రచారమే.. అనదగ్గ స్థాయిలో ఉధతంగా జనంలోకి వెళ్ళాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ చేపట్టబోయే పల్లెబాట.. దాదాపు ఎన్నికల ప్రచారం లాంటిదేనంటున్నాయి వైసీపీ శ్రేణులు.
ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమం వుండబోతోందంటూ తొలుత మీడియాకి లీకులు అందాయి.. ఆ తర్వాత వైసీపీ నేతలు అధికారికంగానే ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ‘మేమెందుకు ముందస్తు ఎన్నికలకు పోతాం.?’ అని వైసీపీ పదే పదే ప్రశ్నిస్తోంది. అదే సమయంలో ‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్ధం..’ అని వైసీపీ అంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళితేనే.. ముందస్తుకి ఆస్కారం వుంటుంది.
‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా..’ అన్న మాట వైసీపీ నుంచి రాకూడదు. వస్తోందంటే, తెరవెనుకాల ఏదో జరుగుతోంది. రాజధాని విషయంలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టుదలతో వున్నట్లు తెలుస్తోంది. న్యాయపరమైన వివాదాల కారణంగా మూడు రాజధానుల అంశానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పల్లెబాట కార్యక్రమం ద్వారా మూడు రాజధానులపై ప్రజల్లో అవగాహన స్వయంగా కల్పించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. అదే నిజమైతే.. ముందస్తు ఆలోచన చేస్తే.. కొరివితో తలగోక్కున్నట్లే అవుతుందంటూ వైసీపీ మీద రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.