YS Jagan: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ప్రజలపై అధిక భారాన్ని మోపుతున్నారు. ఈ క్రమంలోనే వీటన్నింటినీ ప్రశ్నిస్తూ నిరసనలు చేపట్టాలి అంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా డిసెంబర్ 11, 27, జనవరి 3వ తేదీల్లో రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.
డిసెంబర్ 11వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో వైఎస్ఆర్సిపి శ్రేణులు కలెక్టరేట్ వద్దకు వెళ్లి నిరసనలు తెలియజేయాలని వెల్లడించారు. రైతులకు ఇస్తామని చెప్పిన రైతు భరోసా 20వేలను ఇప్పటివరకు నెరవేర్చకపోవడం గురించి అదే విధంగా వీటితో పాటు ఇప్పటివరకు రైతులకు అందుతున్న ఉచిత పంటల బీమాను రైతులకు వర్తింపజేయాలన్న డిమాండ్ తో రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేయాలని తెలిపారు.
చంద్రబాబు సర్కార్ కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమానికి నిరసనగా డిసెంబరు 27న ఆందోళన చేపట్టాలని జగన్ మరో పిలుపునిచ్చారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఇచ్చిన హామీ విస్మరించి పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించమని, జనవరిలో పెంచబోయే కరెంటు ఛార్జీలు కూడా తగ్గించమని డిమాండ్ చేయనున్నారు. ఇక జనవరి మూడో తేదీ ఫీజు రియంబర్స్మెంట్ విషయంపై ఆందోళనలు చేపట్టి కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలి అంటూ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
తాజాగా జగన్మోహన్ రెడ్డి ఈ పిలుపుకు కారణం గురించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు.జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకే ఇలా నిరసనలకు పిలుపు నిచ్చారని యనమల తెలిపారు. గతంలో ఆయన తండ్రి వైఎస్, చెన్నారెడ్డి హయాంలో ఇలాంటి పనులే చేశారని ఆరోపించారు. జగన్ పిలుపు హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. వారి ప్రభుత్వ హాయామంలో వచ్చిన సమస్యలన్నింటిని కూడా మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.