జగన్ ప్రమాణ స్వీకారం… డేటు, ప్లేసే కాదు టైమ్ కూడా ఫిక్స్!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కి సంబంధించిన ఫలితాలు జూన్ 4న వెలువడనున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆ రోజు ఉదయం 11 గంటల తర్వాత నుంచే ఫలితాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 2019 స్థాయిలో వేవ్ ఉండకపోయినా.. విషయంపై మాత్రం స్పష్టత వచ్చేస్తుందని చెబుతున్నారు.

మరోపక్క గెలుపుపై కూటమితో పోలిస్తే వైసీపీ నేతలు మాత్రం పూర్తి ధీమాతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. రాబోయేది కూటమి ప్రభుత్వమే అని టీడీపీ నేతలు చెబుతున్నా.. వైసీపీ నేతలు చెబుతున్నంత బలంగా చెప్పలేకపోతుండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ జూన్ 9న విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేతలు బలంగా చెబుతున్నారు.

లండన్ పర్యటనకు వెళ్లే ముందు ఐప్యాక్ టీం ని కలిసిన వైఎస్ జగన్ సైతం… ఈ ఎన్నికల్లో ఫలితాలు 2019 కంటే అద్భుతంగా ఉంటాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో… శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. గతంలో 151 స్థానాల్లో వైసీపీ విజయం కూడా ఊహించనిదే, ఈసారి కూడా చాలామంది ఊహించని రీతిలోనే మొత్తం 175 స్థానాల్లోనూ విజయాన్ని అందుకుంటామని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.

ఈ సమయంలోనే ఇప్పటి వరకు డేట్, ప్లేస్ ఫిక్స్ చేసేశారు వైసీపీ నేతలు. ఈ క్రమమోనే తాజాగా టైమ్ కూడా ఫిక్స్ చేశారు. ఇందులో భాగంగా… జూన్ 9న విశాఖలో ఉదయం 9:30 గంటలనుంచి 11:30 గంటల మధ్య సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈసారి వైసీపీ భారీ మెజార్టీతో గెలవబోతుందని అన్నారు.

పోలింగ్ రోజు మహిళలు, వృద్ధులూ బూత్ ల వద్ద కట్టిన క్యూలు.. ఒకపక్క వర్షం పడుతున్నా కూడా కొన్ని చోట్ల ప్రజలు క్యూలైన్లలో వేచి ఉండి మరీ అర్ధరాత్రి వరకూ ఓటు వేశారంటే.. అది జగన్ ని గెలిపించుకోడానికేనని చెప్పారాయన. దీంతో గెలుపుపై వైసీపీ నేతల ధీమా ఆసక్తికరంగా మారింది.

మరోపక్క కూటమిలో మాత్రం గెలుపు ధీమా ఈస్థాయిలో కనిపించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పైకి కూటమి గెలుస్తుందని అంటున్నారే కానీ.. ఆ మాటల్లో సరైన ధీమా కానీ, సీట్ల విషయంలో స్పష్టత కానీ ఉన్నట్లు అనిపించడం లేదని అంటున్నారు. మరి వైసీపీ నేతల ధీమా గెలుస్తుందా.. లేక, వ్యూహాత్మక మౌనం అని చెబుతున్న కూటమి నేతల సైలెన్స్ విక్టరీ సాధిస్తుందా అనేది వేచి చూడాలి!