రానున్న ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఎలాగైనా మెజారిటీ సీట్లు గెలవటం కోసం జగన్మోహన్ రెడ్డి సూపర్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ సీట్లుండగా పోయిన ఎన్నికల్లో వైసిపికి ఐదుసీట్లే వచ్చాయి. సరే అందులో మళ్ళీ ముగ్గురు ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించారుకోండి అదివేరే సంగతి. పోయిన సారి ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో సామాజికవర్గాల సమీకరణల్లో పొరబాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు.
టిక్కెట్ల కేటాయింపులో ముఖ్యంగా జనసేన ప్రభావంపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. ఎందుకంటే, జిల్లా మొత్తంమీద కాపులు, బిసిల ప్రాబల్యమే ఎక్కువ. అందుకనే కాపులకు 7 సీట్లు, బిసిలకు 5 సీట్లు ఇవ్వాలని దాదాపు డిసైడ్ అయ్యారట. మూడు ఎస్సీ రిజర్వుడు కాగా ఒకటి ఎస్టీ రిజర్వుడు సీటు. మిగిలిన మూడు సీట్లను రెడ్లకు కేటాయించనున్నట్లు సమాచారం. సామాజికవర్గాల సమీకరణల ప్రకారమే అభ్యర్ధుల ఎంపికకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. పోయిన ఎన్నికల్లో ఇదే అంశంపై జగన్ ఫెయిలయ్యారు. జగన్ ను అధికారానికి దూరం చేసిన జిల్లాల్లో ఉభయగోదావరి జిల్లాలు కూడా కీలక పాత్రను పోషించాయి. రెండు జిల్లాల్లోని 34 సీట్లలో జగన్ కు వచ్చింది కేవలం ఐదుమాత్రమే అంటే ఏస్ధాయిలో దెబ్బ పడిందో అర్ధం చేసుకోవచ్చు.
రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లి సీట్లలో నాలుగు తూగోజిలోను మూడు నియోజకవర్గాలు పగోజిలో ఉన్నాయి. తూగోజిలోని నాలుగు అసెంబ్లీల్లో అనపర్తి సీటును రెడ్లకు కేటాయిస్తున్నారు. బహుశా డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి బరిలో ఉండే అవకాశం ఉంది. మిగిలిన రాజమండ్రి రూరల్, అర్బన్, రాజానగరం సీట్లలో రాజమండ్రి అర్బన్ సీటును బిసి తూర్పుకాపు ఉపకులానికి చెందిన రౌతు సూర్యప్రకాశరావే పోటీ చేయచ్చు. రాజమండ్రి రూరల్ సీటులో ఆకుల వీర్రాజు వైపు మొగ్గుంది. ఇక రాజానగరంలో జక్కంపూడి విజయలక్ష్మి లేదా కొడుకు జక్కంపూడి రాజా పోటీ చేయవచ్చు.
అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు. నిడదవోలు మాత్రమే జనరల్ సీటు. అందుకే జనరల్ సీటును కాపులకు కేటాయించే విషయంపై జగన్ ఆలోచిస్తున్నారు. అదే నిజమైతే జీఎస్ శ్రీనివాసులనాయుడుకు టిక్కెట్టు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. మొత్తం మీద రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో మూడు కాపులకు, రెండు ఎస్సీలు, ఒకస్ధానం బిసి తూర్పుకాపులకు ఒకటి రెడ్లకు కేటాయించనున్నట్లు సమాచారం.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రధానంగా కాపుల మద్దతుంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే, పవన్ కూడా కాపులకు ఎక్కువ టిక్కెట్లు కేటాయించకుండా వ్యూహాత్మకంగా కాపేతర సామాజికవర్గాలను దగ్గర తీసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ కాపులు జనసేనకే ఓట్లు వేస్తారు కాబట్టి ఇతర సామాజికవర్గాలను కూడా దగ్గరకు తీసుకుంటే ఆ ఓట్లు కూడా జనసేనకు పడతాయన్నది పవన్ భావనగా జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇక సామాజికవర్గాల సమీకరణలు, సర్వేల విషయంలో చంద్రబాబునాయుడు గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో సామాజికవర్గాల ప్రభావం మీదే ఓటింగ్ నడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.