గత ఎన్నికల్లో వైసీపీ ఆశలు పెట్టుకుని కోల్పోయిన అసెంబ్లీ స్థానాల్లో పాలకొల్లు కూడ ఒకటి. ఈ స్థానంలో ఎప్పటి నుండో తెలుగుదేశం హవానే నడుస్తోంది. నిమ్మల రామానాయుడు ఇక్కడ పార్టీకి ఎలాంటి ఇడిదుడుకులు లేకుండా నడిపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన 2019లో జగన్ సునామీని ఎదుర్కొని నిలబడి మరీ 17 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఆ మెజారిటీ చూస్తేనే నిమ్మల బలమేంటో అర్థం చేసుకోవచ్చు. పైగా గత ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీ అభ్యర్థి డాక్టర్ బాబ్జీ అలియాస్ సత్యనారాయణమూర్తి సైలెంట్ అయిపోయారు. పార్టీని పైకి లేపే ప్రయత్నాలేవీ జరగట్లేదు.
పశ్చిమగోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గంలో పార్టీ ఇలా పడక వేయడం జగన్ కు అస్సలు నచ్చట్లేదు. అందుకే ఏదో ఒక ప్రత్యామ్నాయం చూసే ప్రయత్నాల్లో ఉన్నారాయన. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఆయనకు తెలుగుదేశం నుండే ఒక లీడ్ డొరొకిందట. ఆయనే పితాని సత్యనారాయణ. పితాని రాజకీయ అనుభవం చాలా పెద్దది. కాంగ్రెస్, టీడీపీలో చక్రం తిప్పిన వ్యక్తి. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ముఖ్య అనుచరుడిగా మారిపోవడం ఆయన ప్రత్యేకత. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన ఆయన ఆతర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలకు నమ్మిన వ్యక్తిగా నడుచుకున్నారు. 2014 ముందు టీడీపీలోకి జంప్ చేసి ఆచంట నుండి గెలుపొంది పశ్చిమగోదావరి రాజకీయాలను ఒక పట్టుబట్టారు.
కానీ గతఎన్నికల్లో ఓడిపోవడం, కుమారుడి మీద ఈఎస్ఐ స్కామ్ ఆరోపణలు రావడంతో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఆయన మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. గత ఎన్నికలకు ముందే వైసీపీలోకి వెళదామనుకున్న ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దొరక్కపోవడంతో మానుకున్నారు. ఒకవేళ వెళ్లి ఉంటే ఎంపీ టికెట్ దక్కేదే. అందుకే ఈసారి ఏమైనా అవకాశం ఉంటుందేమో అన్నట్టు చూస్తున్నారు. ఈయన ఆసక్తిని గమనించిన జగన్ సూపర్ స్కెచ్ ఒకటి రెడీ చేశారట. పితాని గనుక పార్టీలోకి వస్తే ఆయన్ను పాలకొల్లుకు పంపించి పార్టీ బాధ్యతలు మొత్తాన్ని అప్పజెప్పాలని చూస్తున్నారట.
నిమ్మల రామానాయుడు లాంటి బలమైన నాయకుడ్ని ఢీకొట్టాలంటే పితాని సత్యనారాయణే సరైన వ్యక్తని, కాస్తంత ప్రోత్సాహం అందిస్తే మిగతాది ఆయనే చూసుకుంటారనేది జగన్ ఆలోచనట. అంతేకాదు పాలకొల్లులో వైసీపీ వర్గ విభేదాలతో అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడా ఆ నియోజకవర్గం నేతల పేర్లు వినబడట్లేదు. అందుకే ఆ స్థానంలోకి పితానిని దింపితే పరిస్థితులు చక్కబడతాయని జగన్ ఆలోచిస్తున్నారట. మరి టీడీపీ నాయకుడి మీదకు టీడీపీ నాయకుడినే ప్రయోగించే జగన్ ప్లాన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.