జనసేనకు వైసీపీ అధినేత జగన్ స్టార్ క్యాంపెయినర్ అయ్యారా.?

YS Jagan

ఇదెక్కడి చోద్యం.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారుగానీ.. సోషల్ మీడియాలోనే కాదు, ఊళ్ళల్లో రచ్చబండల మీద కూడా ఇదే చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ అవతారం ఎత్తారన్నది ఆ చర్చల సారాంశం.

2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు, వచ్చిన సీటుని పరిగణనలోకి తీసుకుంటే, అసలంటూ జనసేన పార్టీ పేరుని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వైసీపీ తీసుకురాకూడదు. అలాంటిది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే జనసేన ప్రస్తావన తీసుకొస్తున్నారు.

విమర్శలే అయినా, జనసేనకు కలిసొస్తున్నాయ్.. దత్త పుత్రుడంటూ జనసేనాని మీద ముఖ్యమంత్రి చేస్తోన్న విమర్శలు నానాటికీ అభాసుపాలవుతున్నాయి. అధికారం వైసీపీ చేతుల్లోనే వుంది గనుక, ఆ దత్తత కార్యక్రమం తాలూకు వివరాలు అధికారికంగా వెల్లడించేస్తే బావుండేది.

టీడీపీ – జనసేన కలవకపోతే వైసీపీకి పుట్టగతులుండవన్నట్టుగా.. టీడీపీ వైసీపీ కలిస్తేనే వైసీపీకి ఏదో లాభమన్నట్టుగా.. విడివిడిగా ఆ రెండు పార్టీలు పోటీ చేయకపోతే బ్రహ్మాండం బద్ధలైపోతుందన్నట్టుగా వైసీపీ నేతల వాదనలు కనిపిస్తున్నాయి.

ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది. ఈలోగా ఆ రెండు పార్టీల పొత్తు గురించి, రాష్ట్రంలో కుల సమీకరణాల గురించీ వైసీపీ అధినేత మాట్లాడటం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్ర ప్రజలు సైతం ఈ విషయంలో ముఖ్యమంత్రిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.