తిరుపతి ఉప ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ఎంపిక చేయగా వైసీపీ నుండి ఒక వైద్యుడిని బరిలోకి దింపాలని చూస్తున్నారు. అయితే ఈ ఎన్నికలను నడిపే బాధ్యతను చంద్రబాబు కొందరు మాజీ ఎమ్మెల్యేలకు, ఎన్నికల స్ట్రాటజిస్ట్ రాబిన్ శర్మకు అప్పగించగా వైఎస్ జగన్ మాత్రం అనూహ్యమైన వ్యక్తిని రంగంలోకి దింపనుంది. మొదట్లో జగన్ కూడ ఈ బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికో లేకపోతే బంధువు వైవీ సుబ్బారెడ్డికో ఇవ్వాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ప్లాన్ మార్చుకున్నారట. ఇప్పుడు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కు పిలుపు వెళుతోందట. ఆయనైతే ఎన్నికల్లో నెగ్గుకురాగలరని భావిస్తున్నారట సీఎం. ఎందుకంటే ఎన్నికలు జరగనున్న లోక్ సభ స్థానం ఎస్సీలకు కేటాయించబడిన స్థానం. అందుకే నందిగం సురేష్ జగన్ ఛాయిస్ అయ్యుండొచ్చు.
పైగా నందిగం సురేష్ జగన్ కు అత్యంత నమ్మకస్థుడు. ఇప్పటివరకు జగన్ మాటను జవదాటలేవు. చెప్పిన ప్రతి పనినీ చెప్పినట్టు చేస్తూ వచ్చారు. ఎక్కడో ఉండాల్సిన తనను జగన్ ఇంతవాడిని చేశారని, ఆయన కోసం ఏదైనా చేస్తానని నందిగం సురేష్ అంటుంటారు. అందుకే ఈసారి జగన్ అప్పగించబోయే బాధ్యతను తీసుకోవడానికి ఆయన రెడీగా ఉన్నారట. నందిగంను మాత్రమే ఎంచుకోవడానికి ఇంకొక కారణం ఆయన ఎస్సీ కావడం. లోక్ సభ ఎలాగూ ఎస్సీలకు కేటాయించబడిన స్థానమే కాబట్టి నందిగం సురేష్ అయితే బాగుంటుందని జగన్ భావించి ఉండవచ్చు. అందుకే జగన్ సురేష్ మీద నమ్మకముంచారట. పైగా సురేష్ యువకుడు కావడం వలన యువత ఓట్లను గట్టిగా ఆకర్షించగలరని అనుకుంటున్నారట.
ఇక తెర వెనుక నుండి కథ నడపడానికి పెద్దిరెడ్డి ఎలాగూ ఉన్నారు. కావాల్సిన వనరులను సమకూర్చడం, ప్రచార ప్లానింగ్, రోడ్ షోలు ఇలా అవన్నీ ఆయనే చూసుకుంటారు. నందిగం సురేష్ చేయాల్సిందల్లా ముందుండి చెప్పిన పనులు చేసుకుంటూ వెళ్లిపోవడమే. పైగా మూడు రాజధానులను టీడీపీ, బీజేపీ, జనసేనలు వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ ఈ అంశాన్నే వారు ఉప ఎన్నిక ప్రచారంలో లేవనెత్తి అమరావతికి అన్యాయం చేస్తున్నారని అంటే గుంటూరుకు చెందిన ఎంపీగా అలాంటిదేం లేదని, ప్రజలు మూడు రాజధానులకు సుముఖంగా ఉన్నారని నందిగం సురేష్ ద్వారా చెప్పిస్తే ఎలాంటి సమస్యా ఉండదని జగన్ భావిస్తున్నారట. మొత్తానికి జగన్ అనూహ్య రీతిలో ఐడియాలు మారుస్తూ ప్రత్యర్థులను చిక్కుల్లో పెట్టడానికి రెడీ అయిపోతున్నారన్నమాట.