ఇన్నాళ్లు సంక్షేమ పథకాల అమలులో బిజీబిజీగా ఉంటూ జిల్లా స్థాయి రాజకీయాల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దగా దృష్టి సారించలేకపోయారు. ఇటీవలే పార్టీ కీలక నేతలు అందరూ కలిసి కాస్త సమయాన్ని జిల్లాలకు కేటాయించాలని కోరడం, పలు నియోజకవర్గాల్లో సమన్వయం లోపించడంతో వైఎస్ జగన్ సైతం కాస్త కిందికి చూడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏయే జిల్లాలకు అభివృద్ది కార్యక్రమాలు అమలుచేయడానికి ఆస్కారం ఉందో పరిశీలించారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ జగన్ దృష్టిలో పడింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు ఏపీలో ప్రత్యేకమైన పేరుంది. అక్కడ వ్యవసాయ, మత్స్య రంగాల మీద ఆధారపడి జీవించే వారు ఎక్కువ.
రాష్ట్రానికి ఆ జిల్లాల నుండి వచ్చే ఆదాయం భారీగానే ఉంటుంది. కానీ ఏ ప్రభుత్వం కూడ ఈ జిల్లాల మీద పెద్దగా దృష్టి పెట్టింది లేదు. ముఖ్యంగా మత్స్య రంగం మీద. గోదావరి జిల్లాల్లో ఆక్వా రంగం మీద ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనం సాగించేవారి 8 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. కానీ ఈ రంగాన్ని అభివృద్ది చేయాలనే తపన గత పాలకులకు లోపించింది. అవగాహన లోపం, నిపుణుల కొరత వంటి కారణాలతో ప్రతి యేటా ఆక్వారంగం 2000 కోట్ల వరకు నష్టపోతోంది. దీనికి పరిష్కారంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుతూ వచ్చారు.
కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో జిల్లా వాసుల యూనివర్సిటీ కల కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ కలను నెరవేర్చి జిల్లా వాసుల మనసులో నిలిచిపోవాలని వైఎస్ జగన్ సంకల్పించారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆంధ్రా ఫిషరీస్ పేరుతో యూనివర్సిటీని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 300 కోట్లు ఖర్చు చేయనున్నట్టు అంచనా. వీలైనంత త్వరగా విశ్వవిద్యాలయాన్ని అందుబాటులోకి తేవాలని సీఎం నేతలకు సూచించారట. ఇంకా ఆక్వా, ఫిషరీస్ రంగాల అభివృద్దికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే విషయమై ప్రత్యేక బృందాల ద్వారా సమగ్ర పరిశీలన జరపాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. సో.. రానున్న రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు వైఎస్ జగన్ మరిన్ని వరాలు అందించే అవకాశం ఉంది.