విమర్శల డోసు పెంచిన వైఎస్ జగన్.! ఎందుకబ్బా.?

వైఎస్ జగన్ సర్కారు, మత్స్యకార భరోసా పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేసింది. ఈ మేరకు జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, బటన్ నొక్కి, డబ్బుల్ని విడుదల చేశారు.

షరామామూలుగానే, తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తోందని చెప్పుకొచ్చారు వైఎస్ జగన్ ఈ బహిరంగ సభ వేదిక సాక్షిగా. అయితే, గతంతో పోల్చితే ఇంకాస్త ఎక్కువ స్థాయిలో విపక్షాలపై దుమ్మెత్తి పోశారు. పనిలో పనిగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు వైఎస్ జగన్.

బీజేపీ ఓడిపోతే సంబరాలు చేసుకున్న టీడీపీ, జనసేన.. బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యాంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ‘మీ బిడ్డ ఒంటరిగానే వస్తాడు.. ఎవరు ఎలా ఎవరితో జత కట్టినా.. మళ్ళీ వచ్చేది మన సంక్షేమ ప్రభుత్వమే..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నినదించారు.

పదే పదే దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్.. అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఘాటైన విమర్శలు చేశారు వైఎస్ జగన్. చంద్రబాబుని పేరు పెట్టి ప్రస్తావిస్తూ, పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించేందుకు మాత్రం వైఎస్ జగన్ ఇష్టపడటంలేదు.

కాగా, ఈ బహిరంగ సభకు పెద్దయెత్తున జనాన్ని సమీకరించాయి వైసీపీ శ్రేణులు. ప్రభుత్వం తరఫున కూడా తగిన స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. గతంతో పోల్చితే, వైఎస్ జగన్ విమర్శల తీవ్రత విపక్షాలపై పెరగడానికి కారణమేంటి.? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇది ముందస్తు ఎన్నికల సంకేతమా.? అన్న అనుమానాలు తెరపైకొస్తున్నాయి.