ఇళ్ళు జగనన్న కట్టిస్తే పేరు ఇంకొకరు తన్నుకుపోతారు 

YS Jagan worrying about president rule in AP
వైఎస్ జగన్ అనితరసాధ్యమైన పనిని నెత్తికెత్తుకున్నారు.  వేళా కోట్ల వ్యయంతో ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ, ఉచిత ఇళ్ల నిర్మాణం అంటూ కొత్త పథకాన్ని స్టార్ట్ చేశారు.  ఈ పథకం కింద మొదటి దశలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టనుండగా రెండు దశల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.  మొత్తంగా ఐదేళ్లలో 30.75 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామని జగన్ మాటిచ్చారు.  17 వేల వైఎస్ జగనన్న కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, పార్కులు,  కమ్యూనిటీ హాళ్లు, క్లినిక్స్ ఇలా అన్ని సదుపాయాలు ఉంటాయని మాటిచ్చారు.  ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 50, 940 కోట్లు.  ఈ ఖతీర్చు పెరిగే అవకాశాలే కానీ తగ్గే ప్రసక్తే ఉండదు.  ఈ లెక్కలన్నీ చూస్తే జరిగే పనేనా అనిపిస్తుంది.  ఎందుకంటే రాష్ట్రం యొక్క ఆర్ధిక పరిస్థితి అలా ఉంది మరి. 
YS Jagan
YS Jagan
ప్రస్తుతం ఖజానా పరిస్థితి చూస్తే ప్రభుత్వాన్ని నడపడానికే బయట నుండి అప్పులు తేవాల్సిన పరిస్థితి ఉంది.  తెస్తున్నారు కూడ.  ఈ ఏడాదిన్నర కాలంలోనే జగన్ సర్కార్ సంక్షేమ పథకాల కోసం 40 వేల కోట్లు వెచ్చించినట్టు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.  ఆర్ధిక సంవత్సరం మొదటి రెండు నెలలు ఏప్రిల్, మే నెలల్లో రూ. 29,418 కోట్ల అప్పులు తెచ్చారు.   ఈ అప్పు 2019 ఏప్రిల్, మే నెలల్లో బాబు హయాంలోని గత ప్రభుత్వం చేసిన అప్పు కంటే చాలా ఎక్కువ.  గత యేడాది చంద్రబాబు రూ.7,346 కోట్ల అప్పు చేసింది.  దాన్ని బీట్ చేసి రూ.29,418 కోట్లతో కొత్త రికార్డ్ సృష్టించారు జగన్.  ఈ కొత్త అప్పులు, పాత అప్పులు కలుపుకుని మొత్తం 3.4 లక్షల కోట్ల అప్పు మన రాష్ట్రం మీదుంది.  ఈ భారంలో ఇళ్ల కోసం 50 వేల కోట్లు ఖర్చు చేయగలరా అనే అనుమానం కలుగుతోంది. 
 
పథకాన్ని అయితే అట్టహాసంగా స్టార్ట్ చేశారు.  ఎప్పటికప్పుడు నిధులు దండిగా కేటాయిస్తూ, లోటు లేకుండా, పనులు ఆగకుండా చూసుకుంటేనే అనుకున్న సమయానికి ఇళ్ల నిర్మాణం పూర్తి కాగలదు.  కానీ జిల్లా విభజన, సంక్షేమం అమలు లాంటి భారీ ఖర్చులు వెంటాడుతూనే ఉంటాయి.  వాటిని నిర్లక్ష్యం చేయడం కుదరదు.  ఇప్పటికే పరిమితులకు మించి అప్పులు చేశారు,  కేంద్రం ఇచ్చిన 5 శాతం పరిమితి వెసులుబాట్లను కూడ వాడేసుకున్నారు.  తాజాగా అదనపు నిధులు సమీకరణలో భాగంగా 4,898 కోట్లు సమీకరణకు అనుమతి ఇచ్చింది.  ఇవి ప్రారంభ ఖర్చులకు సరిపోతాయి కానీ ముందు ముందు ఎలా చేస్తారనే విషయమై క్లారిటీ లేదు.  
 
ఒకవేళ నిధుల సమీకరణలో పక్కా ప్రణాళిక లేకుండా పథకాన్ని ప్రారంభిద్దాం, ఎలా అయితే అలా అవుతుంది అనే ధోరణిలో గనుక ప్రభుత్వం ఉన్నట్టైతే చంద్రబాబు నాయుడు హయాంలో టిడ్కొ ఇళ్లకు పట్టిన దుర్భర పరిస్థితే ఈ వైఎస్ జగనన్న కాలనీలకు పట్టే ప్రమాదముంది.  జగన్ పాలన కాలం ఇంకో మూడున్నరేళ్లు ఉంది.  ఈ మూడున్నరేళ్లలో ప్రాజెక్ట్ పూర్తై ఆఖరి లబ్ధిదారు కూడ గృహప్రవేశం చేసేయాలి.  అలా కాకుండా నిధుల కొరత, అవినీతి కారణాల వలన పనులు నత్తనడక సాగితే మాత్రం మధ్యలోనే ఆగిపోతాయి.  పనులు సగమే అయినా వచ్చే దఫాలు జగన్ సర్కారే వస్తే పర్వాలేదు.  అలాకాకుండా వేరొకరి ప్రభుత్వం వస్తే మాత్రం ఇప్పుడు చంద్రబాబు మొదలుపెట్టిన టిడ్కొ ఇళ్లను జగన్ ఎలాగైతే పంచుతున్నారో రేపు వైఎస్ జగనన్న కాలనీలను వేరొకరు పంచాల్సిన పరిస్థితి రావొచ్చు.   అది కూడ కాలనీలకు జగన్ పేరు తీసేసి వారి పేర్లు పెట్టుకుని పంచేస్తారు.  కాబట్టి జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేయకుండా ముందుకు తీసుకెళ్ళాలి.