‘మదుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో’… జగన్ ఈజ్ బ్యాక్ అంట!?

అది 2014 – 19 కాలం.. నాటి ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు పసుపు కండువాలు కప్పేశారు. దీంతో.. సంతలో పశువుల్ని కొన్నట్లు కొన్నారంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇక అసెంబ్లీలో జగన్ పై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేతలు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లే వచ్చాయి! అది వేరే సంగతి!

ఇక వీళ్ల వ్యవహారాలకు స్పీకర్ ఆజ్యం పోసేవారనే విమర్శలు వినిపించాయి. పూర్తి నియంతృత్వ ధోరణిలో 2014 – 19 మధ్య అసెంబ్లీ సమావేశాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపించేవారు. దీంతో హర్ట్ అయిన జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.. జనాల్లోకి వచ్చేశారు. చారిత్రాత్మక పాదయాత్ర చేపట్టారు.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

కట్ చేస్తే 2019లో నాటి ప్రభుత్వ అరాచకాలకు తోడు, హామీలు ఎగ్గొట్టిన విధానానికి తోడు, తమ సమస్యలపై ఎలుగెత్తిన జగన్ కు 151 సీట్లు సింగిల్ గా కట్టబెట్టారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ తీరు, విధానం, మాట, నడక, నడత చాలా మందికి నచ్చేవి. నేడు జగన్ కి ఉన్న బలమైన ఫ్యాన్స్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినవారే!

ఈ క్రమంలో తాజాగా మరోసారి నాటి జగన్ కనిపించారని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. అప్పుడు చూపించిన ఫైర్ తాజాగా మరోసారి కనిపించిందంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనికంతటికీ కారణం… నేడు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి నల్ల కండువాలు ధరించి, ఫ్లకార్డులు చేతపట్టి వెళ్తున్నప్పుడు పోలీసులు చేసిన ఓవరేక్షనే!

అవును… రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు, అకృత్యాలు, అత్యాచారాలు, దాడులకు నిరసనగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు జగన్ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నల్ల కండువాలు ధరించి, సేవ్ డెమోక్రసీ, హత్యా రాజకీయాలు అపాలి అని రాసి ఉన్న ఫ్లకార్డులను చేతపట్టి బయలుదేరారు. ఈ సమయంలో ఎంటరైన పోలీసులు వీరిని అడ్డుకున్నారు!

ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ఫ్లకార్డులను లాక్కుని, చింపివేశారు పోలీసులు. దీంతో… జగన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా… “ఇలా ప్రజా ప్రతినిధుల చేతిలో నుంచి ఫ్లకార్డులు లాక్కుని చించే అధికారం ఎవరిచ్చారు” అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అక్కడున్న పోలీసు అధికారిని ఉద్దేశించి… “మదుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో.. ఎల్లకాలం ఇదేమాదిరి ఉండదు.. ప్రజాస్వామ్యంలో ఉన్నాంమనం.. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్ధం ఏమిటో తెలుసా?.. అధికారంలో ఉన్నవాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు.. ప్రజస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరు ఉన్నారు” అంటూ ఫైరయ్యారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. జగన్ లో ఈ ఫైర్ నే కార్యకర్తలు కోరుకుంటున్నారని.. ఈ ఫైర్ లేకుండా నాడు రాష్ట్రంలో ఏమి జరిగినా చిక్కటి చిరునవ్వులు చిందించడం వల్లే 2024లో అలాంటి ఫలితాలు వచ్చాయని.. జగన్ కి ఈ ఫైరే ఆయుధం అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!