గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు బెదిరింపుల వల్ల ఈ నెల 18న బేస్తవారి పేట మండలం సింగరపల్లిలో జనసేన కార్యకర్త వెంగయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం నాడు వెంగయ్య కుటుంబాన్ని కలిసిన పవన్ కళ్యాణ్ జనసేన తరపున 8.50 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించారు. వెంగయ్య నాయుడు పిల్లల చదువులు పూర్తయ్యే వరకూ అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా జనసేనాని వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై సీరియస్ అయ్యారు. ఎట్టి పరిస్థితులోనూ ఈ సారి అన్నా రాంబాబును చట్ట సభల్లోకి వెళ్ళనివ్వమని అన్నారు.
అంతేకాకుండా వెంగయ్య కుటుంబ సభ్యులతో కలిసి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై పవన్ కళ్యాణ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయటం జరిగింది. ఏపీలో ఈ వ్యవహారం మీద జరుగుతున్న రచ్చ గురించి వైసీపీ నేతలు జగన్ కి తెలియచేశారని సమాచారం. ఒక పక్క అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తూ ప్రజల అభిమానం చూరగొంటుంటే అన్నా రాంబాబు లాంటి నేతల చర్యల వల్ల పార్టీ పరువు నాశనమవుతుంది అని జగన్ సీరియస్ అయ్యారట. ఇలాంటివి మరలా రిపీట్ కాకుండా చూసుకోమని చెప్పమని సూచించారట.