లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్… “కల్యాణం”లపై కామెంట్స్ వైరల్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై జగన్ మరోసారి సెటైర్స్ వేశారు. కాకపోతే ఈసారి మరింత డోస్ పెంచారని మాత్రం చెప్పవచ్చు. ఈసారి ప్రాంతాల వారీ ఇష్యూన్ని టచ్ చేస్తూ ప్రాసలతో చెలరేగారు వైఎస్ జగన్. ఇందులో భాగంగా లోకల్, నేషనల్, ఇంటర్ నేషనల్ అనే టాపిక్ ఎత్తారు వైఎస్ జగన్. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ దూకుడు పెంచినట్లయ్యింది.

అవును… సామ‌ర్లకోట స‌భ‌లో ముఖ్యమంత్రి జగన్ తాజాగా చేసిన కామెంట్స్ ఏపీలో హాట్ టాపిక్‌ గా మారాయి. ఇవాళ కాకినాడ జిల్లా సామర్లకోటలో జగనన్న సామూహిక గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరైన జగన్.. అక్క‌డ జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పవన్ కళ్యాణ్ పెళ్లిల్లపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

ఇందులో భాగంగా… దత్తపుత్రుడి శాశ్వత నివాసం హైదరాబాద్.. కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు ప్ర‌తి మూడు నాలుగేళ్లకు ఒకసారి మారుతుంటుందని ఎద్దేవా చేశారు. ఒకసారేమో లోకల్ అని, ఇంకోసారి నేషనల్, మరొకసారి ఇంటర్నేషనల్ అని విమర్శించారు. ఇక ఆ తర్వాత ఎక్కడికి పోతాడో అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

అలా విమర్శలు చేస్తూ మొదలుపెట్టిన జగన్.. వాటిని కేవలం విమర్శల వరకూ మాత్రమే ఆపలేదు. ఆడవాళ్లు అన్నా.. వివాహ వ్యవస్థ అన్నా.. దత్తపుత్రుడికి ఏ పాటి గౌరవం ఉందో ఆలోచించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన ఇళ్లలోని మహిళలను, వివాహ వ్యవస్థనూ మనమే గౌరవించకపోతే ఎలా..? అని ఆయన ప్రశ్నించారు.

ఇదే సమయంలో… నాయకుడై ఉండి మూడు నాలుగేళ్లకోసారి ఇల్లాలిని మారుస్తున్నాడని, మహిళలను చులకన భావంతో చూస్తున్నాడని, పవన్ ఎటువంటి నాయకుడో ఆలోచన చేయాలని జగన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

కాగా.. పవన్ పై జగన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో.. తనపై వ్యక్తిగత విమర్శలు చేసినా, తన పెళ్లిళ్ల గురించి మాట్లాడినా చెప్పుతో కొడతానని గతంలో పవన్ ఆవేశంగా మాట్లాడారు. అయినప్పటికీ వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ పై అవిరామంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూనే ఉన్నారు.

ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న వారిలో ఒకరు లోకల్ అయితే మరొకరు నేషనల్ అని, ఇంకొకరు ఇంటర్నేషనల్ అని.. ఈ సారి ఇక ఎక్కడికి వెళతాడో అని కామెంట్స్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై అప్పుడే సోషల్ మీడియా వేదికగా రచ్చ మొదలైంది. దీనిపై పవన్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.