విజయదశమి నుంచే విశాఖలో… ఏపీ కేబినెట్‌ భేటీ కీలక నిర్ణయాలు!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం తాజాగా ముగిసింది. ఈ సందర్హంగా కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పలు కీలకమైన బిల్లులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు బిల్లుకు కేబినెట్‌ కీలక ప్రకటన చేసింది.

ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జగన్ అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన మొత్తాల విడుదలతో పాటు ఉద్యోగులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో కొత్త సంక్షేమ పథకం అమలు చేయాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా… ఏపీలో యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన అభ్యర్ధులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు “జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం”కు ఆమోదం తెలిపింది. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణులైన వారికి రూ.50వేలు, మెయిన్స్‌ లో ఉత్తీర్ణులైతే రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించారు.

ఇదే క్రమంలో… దీనిలో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేబినెట్‌ లో చర్చ జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, జీపీఎస్‌ ముసాయిదా, ఏపీ వైద్య విధాన పరిషత్‌ సవరణ బిల్లులపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న ఆరోగ్య సురక్ష, కురుపాం ఇంజినీరింగ్‌ కళాశాలలో గిరిజనులకు 50 శాతం సీట్లిచ్చే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది.

ఇదే సమయలో అలాగే రిటైర్ అయిన ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉద్యోగి రిటైర్డ్‌ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలని నిర్ణయించింది.

విజయదశమి నుంచే విశాఖ నుంచి పాలన:

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్బంగా పరిపాలనా రాజధాని విశాఖపట్నం గురించి ప్రస్తావిస్తూ.. సమావేశంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని తెలిపారు. అప్పటి వరకు కార్యాలయాలను తరలించాలని ఆదేశించారు.