ఆంధ్ర ప్రదేశ్ లో వైస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నేతల మధ్య పంచాయితీలు మామూలుగా లేవు. ఇటీవల కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన జగన్ అక్కడ యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని వంశీ చేతులు కలిపి వారి గొడవను పరిష్కరించే ప్రయత్నం చేశారు. చీరాల గొడవను కూడా పరిష్కరించేందుకు సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నారు.ఇక ఇప్పుడు జగన్ నెల్లూరు జిల్లా పర్యటనకు వెళుతుండడంతో ఇప్పుడు అక్కడ కొందరు నేతలకు జగన్ స్ట్రాంగ్ క్లాస్ పీకే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. జిల్లా నేతల్లో చాలా మంది మధ్య సఖ్యత లేదు.
వెంకటగిరిలో సీనియర్ నేత ఆనం రామ నారాయణ రెడ్డి ఎప్పుడూ గరంగరం లాడుతూనే ఉన్నారు. ఆయన్ను చల్లార్చడం నేతల వల్ల కావడం లేదు. ఇక మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను జిల్లాలో సొంత పార్టీకే చెందిన ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న పరిస్థితి ఉంది. మరో ట్విస్ట్ ఏంటంటే తిరుపతి పార్లమెంటు పరిధిలోకి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు వస్తాయి. ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ పార్టీలో తీవ్రమైన లుకలుకలు ఉన్నాయి. వీటిని పరిష్కరించకపోతే ఆ ప్రభావం ఖచ్చితంగా ఉప ఎన్నికలపై పడుతుంది. పార్టీ ఓడిపోతుందని కాదు కాని.. మెజార్టీ పడిపోవచ్చు.
వెంకటగిరి పరిస్థితి ఇలా ఉంటే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ పై స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయన బీజేపీలోకి వెళ్తానని బెదిరింపులకు కూడా దిగుతోన్న పరిస్థితి. ఇక మంత్రులు అనిల్ వర్సెస్ మేకపాటి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. విజయసాయిరెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ విషయాలన్నీ జగన్ కి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. ఈ నెలలో నెల్లూరు జిల్లా పర్యటనలో ఈ వ్యవహారాన్ని చక్క బెట్టాలని జగన్ యోచనలో ఉన్నారట.