మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించి.. దాని అమలు కోసం వైఎస్ జగన్ తపించారనే కామెంట్లు అప్పట్లో బలంగా వినిపించాయి. 2019 సమయంలో అధికారంలోకి వచ్చే సరికి తన ముందున్న సీనియర్ పాలకులు రూ.100 కోట్లు మాత్రమే మిగిల్చి వెల్లారని సాకులు నెతుక్కోలేదు.. కరోనా మహమ్మారి రెండేళ్లపాటు ఆర్థిక విధ్వంసం సృష్టించినా వెనకడుగు వేయలేదు.
కట్ చేస్తే… ఏపీలో జగన్ అమలుచేసిన సంక్షేమ పథకాలను ఆల్ మోస్ట్ రెట్టింపు చేస్తూ, వాటికి మరికొన్ని ఉచితాలను ప్రకటిస్తూ చంద్రబాబు హామీలను ప్రకటించారు. ‘అమ్మ ఒడి’ కాస్తా ‘తల్లికి వందనం’గా మార్చి ఒక్కరికి కాదు.. ఇంట్లో ఎంతమంది స్కూలు పిల్లలు ఉంటే అంతమందికి రూ.15,000 అన్నారు. ఇసుక ఉచితం అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు.
దీనికి తోడు 18 ఏళ్లు దాటిన ప్రతీ మహిళకూ నెలకు రూ.1,500.. నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి అని తెలిపారు. ఇక ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, రైతులకు ఏడాదికి రూ.20,000 సాయం, ధరలు పెంచకుండా నాణ్యమైన విద్యుతు, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం వంటివి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
అయితే… ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగం వింటే బాబు చాణక్యం అర్థమవుతుందని అంటున్నారు. ఇందులో భాగంగా… ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు.. అందువల్ల ఇచ్చిన హామీలు ఇప్పట్లో అమలయ్యే పరిస్థితి లేదు.. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా సహకరించాలి అనే అర్థం వచ్చేలా ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
అంటే… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చంద్రబాబు, పవన్ కు ఇప్పుడే తెలిసిందా? జగన్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, శ్రీలంక అవుతుందని చెప్పింది వీరిద్దరే కదా? అయినప్పటికీ రెండింతలు సంక్షేమ పథకాలు ఇస్తామని నమ్మబలికిందీ వీరే కదా? డబ్బులు ఎలా అని ప్రశ్నిస్తే… సంపద సృష్టిస్తామని దబాయించిందీ వీరే కదా? పవన్ కూడా తందానతాన అన్నారు కదా?
ఇప్పుడేమో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఇప్పట్లో అమలు చేయలేమని, ప్రజలు అర్థం చేసుకోవాలని చెబుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు సిద్ధపడుతున్నారంటే… ఏమనాలి అనేది అమాయకుడైన ఆంధ్రుడి ప్రశ్న! ఈ సమయంలోనే జగన్ ని పిచ్చోడనుకోవాలా.. లేక, అమాయకుడనుకోవాలా అని ఆలోచిస్తున్నారట సగటు ఏపీ సామాన్యుడు! దానికి గల కారణం చాలా బలంగానే ఉంది సుమా!
మాట ఇస్తే కట్టుబడి ఉండాలి.. మేనిఫెస్టోలో చెప్పామంటే కనీసం 90 శాతానికి తగ్గకుండా హామీలు అమలు చేయాలి.. ప్రజలకు ఇచ్చిన ఆ హామీలు మాట తప్పకుండా అమలు చేయాలనే మైకంలో ఎంతదూరం అయినా వెళ్లాలి.. రాష్ట్ర బడ్జెట్ గురించి లెక్కలేసి ఇంతే చేయగలను అనే నిజాలు చెప్పగలగాలి.. అంతకు మించి తనవల్ల కాదని వాస్తవాలు తెలపాలి అని జగన్ భావించారు.. అందుకే బోర్లా పడ్డారు!!
రైతులకు రూ. లక్ష రుణమాఫీ ప్రకటించాలని, పెన్షనర్లకు రూ.4 వేలు ఇస్తామని హామీ ఇవ్వాలని సొంతపార్టీ నేతలే జగన్ దగ్గర మొత్తుకున్నారు. అయినా వినిపించుకోని జగన్… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది సాధ్యం కాదని మొంకిపట్టు పట్టుకుని ఉన్నారు. అలవిగాని హామీలు ఇవ్వలేనని వాస్తవాలు మైకుల్లో చెప్పేశారు. జనానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తోనూ, వాస్తవాలతోనూ పని లేదని జగన్ గ్రహించలేకపోయారు.
అధికారంలోకి వచ్చాక ఆ హామీలను కచ్చితంగా నెరవేర్చాలని అనుకున్నట్లున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని గవర్నర్ ప్రసంగంలో చెప్పించి, అనుకూల మీడియాలో రాయించి ఇచ్చిన హామీలు ఎగ్గొడితే ఎవడడుగుతాడు? హామీలకు నిధులు కేటాయించాల్సి వస్తుందేమో అని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి మమ అంటే ఎవడు నిలదీస్తాడు? అనే లాజిక్ ని జగన్ మిస్సయ్యారు! అందుకే.. జగన్ ని పిచ్చోడనుకోవాలా?.. అమాయకుడనుకోవాలా?