ట్రాజెడీపై వైసీపీ కామిడీ..!

అన్నారంటే అనరా మరి.. అయిదేళ్ల పాటు చెయ్యరాని అరాచకాలు.. అక్రమాలు యధేచ్చగా చేసి…ఇప్పుడు రెండు ఎదురుదెబ్బలు తగలగానే నెత్తీనోరూ కొట్టేసుకుంటుంటే.. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని అనరా..!

నిజమే..ఎక్కడ దౌర్జన్యం జరిగినా.. ఎప్పుడు అరాచకం పెచ్చుమీరినా ఆ పార్టీ.. ఈ పార్టీ అనే కాదు..  మనిషన్నవాడేవాడైనా ఖందించాల్సిందే.

రాష్ట్రంలో మొన్న ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. అయిదేళ్ల అణచివేత పిదప అధికారం అందిరావడంతో తెలుగుదేశం.. జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా జూలు విదిలించినంత పని చేసారు. ఫలితంగా కొన్ని అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కానివి. అలాగే ఇప్పుడు వైసిపి గగ్గోలు పెడుతున్న వినుకొండ.. తదితర సంఘటనలకు కారకులు ఎవరైనా వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.

సరే..ఇవన్నీ జరగాల్సిన పద్దతిలోనే జరుగుతాయని ఇప్పటికైతే విశ్వసిద్దాం. వినుకొండ ఘటన వెనక వైసీపీ కార్యకర్తలు..నాయకులే ఉన్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. నిజానిజాలు ఆరా తీసేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి.బాధ్యులు తమ వారైనా..పెరవారైనా దండన ఒకేలా ఉండాలి.

ఇక వైసీపీ సంగతి..గడచిన అయిదేళ్లలో ఇలాంటి అకృత్యాలు ఎన్నిటికో పాల్పడిన ఆ పార్టీ ఇప్పుడు ఒకటి రెండు సంఘటనలు చోటు చేసుకున్నంతనే రాహ్ట్రానికి చేటు కాలం దాపురించిందన్నంత హడావిడి చేస్తుండడం చూడ్డానికి ఎబ్బెట్టుగా అనిపించడం లేదూ.. దొంగే దొంగ అని అరిచినట్టు..ఎన్ని దౌర్జన్యాలు.. ఎన్నెన్ని అరాచకాలు.. ఐదేళ్ళపాటు నిరంతరాయంగా సాగించిన వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినట్టు ఢిల్లీ గల్లీలో గగ్గోలు పెట్టడం.. హవ్వ..నవ్విపోదురు గాక మాకేటి అన్న తీరులో ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలట..అలా అయితే గత ఐదేళ్లలో ఎన్నిసార్లు శ్రీమాన్ జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉండేదో..!

బాబాయి హత్యకు బదులు లేదు.. సరైన దర్యాప్తు ఊహు.. భూదోపిడిలు.. సాక్షాత్తు ప్రతిపక్ష నేతతో పాటు అరెస్టుల పరంపర.. రఘురామకైతే కస్టడీలోనే నరకం.. కబ్జాలు..రాజకీయ హత్యలు.. ఒంటెద్దు పోకడలు.. మొత్తంగా ఇష్టారాజ్యం..

అయిదేళ్ల పాటు ఇంత చేసిన వైసీపీ ఇప్పుడు రాష్ట్రానికి తీరని ద్రోహం జరుగుతున్నట్టు గగ్గోలు పెట్టడం…. దెయ్యాలు వేదాలు వల్లించడం గాక ఇంకేమిటి..!?