‘జగన్ రెడ్డి’ అంటే కొందరికి నచ్చడంలేదు కాబట్టి, ఇకపై ‘అన్నగారు’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పిలవబోతున్నారట వైఎస్ షర్మిల.! ఈ విషయాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రజల మాటల్లో షర్మిల తెలుసుకున్నారట.
రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడంలేదని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. ‘వైసీపీ ప్రభుత్వమేమో గొప్పలు చెప్పుకుంటోంది. వారి పిలుపు మేరకు, అభివృద్ధిని చూడటానికి నేను సిద్ధం..’ అని షర్మిల ప్రకటించేశారు.
‘నేను, నాతోపాటు మీడియా, విపక్షాలు.. అందరం కలిసి వెళ్దాం.. మీరు టైమ్ చెప్పినా, నన్ను చెప్పమన్నా ఓకే.. మాతోపాటు రండి.. అభివృద్ధిని చూపించండి..’ అని వైఎస్ షర్మిల సవాల్ విసిరేశారు. రాజధాని ఎక్కడ.? పోలవరం ప్రాజెక్టు ఎక్కడ.? అంటూ వైఎస్ షర్మిల నిలదీయడం గమనార్హం.!
తెలంగాణ రాజకీయాల్లో ‘దుకాణం’ సర్దేసి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘షో’ మొదలు పెట్టిన వైఎస్ షర్మిల, వస్తూనే.. సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సెటైర్ల పర్వానికి తెరలేపారు. అయినాగానీ, వైసీపీ సర్కారుకి వ్యతిరేకంగా షర్మిల మాట్లాడుతోందంటే ఎవరూ నమ్మని పరిస్థితి. జగనన్న బాణం అయిన వైఎస్ షర్మిల, వైసీపీకి రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో లబ్ది చేకూర్చడానికే ఈ స్టంట్లు.. అన్నది మెజార్టీ అభిప్రాయం.!
తెలంగాణలో కేసీయార్ సర్కారుని కూల్చడానికి, ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు కాబట్టి..’ అంటూ, కాంగ్రెస్ పార్టీకి సహకరించిన షర్మిల, ఏపీ రాజకీయాల్లో అదే కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్న ఈ రాజకీయాన్ని ఎలా చూడాలో ఏమో.!
అన్నట్టు, షర్మిల మీద విమర్శలు చేస్తూ, ‘రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరి కొందరు మన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు..’ అంటూ సెటైర్లేశారు వైఎస్ జగన్.. నేరుగా తన సోదరి వైఎస్ షర్మిల పేరు ప్రస్తావించకుండానే.
అంతేనా, ‘చంద్రబాబుకి స్టార్ క్యాంపెయినర్లు చాలామంది వున్నారు..’ అంటూ, షర్మిలని కూడా చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో వైఎస్ జగన్ వేసేశారు.