Y.S.Jagan: సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన ఒక న్యూస్ డిబేట్లో భాగంగా మహిళలను కించపరుస్తూ మాట్లాడారని తెలుగుదేశం పార్టీ నేతలు ఈయనపై కేసులు పెట్టి అరెస్టు చేయడం పట్ల తీవ్రస్థాయిలో వైసిపి నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఇక కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్టుపై జగన్మోహన్ రెడ్డి స్పందించారు. 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని కూటమి సర్కార్ పతాక స్థాయికి తీసుకువెళ్లిందని జగన్ విమర్శలు చేశారు.
పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయిందని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని ఆరోపించారు. గత ఏడాదికాలంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచక పాలనపై ప్రజలు ఎవరు గొంతు విప్పకుండా అణిచివేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.
సాధారణంగా ఒక న్యూస్ డిబేట్ జరిగితే ఆ డిబేట్లో కొంతమంది అనుకూలంగా మాట్లాడుతారు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతారు. డిబేట్లో పాల్గొన్న వారు మాట్లాడే మాటలకు యాంకర్ కు సంబంధం ఏంటని జగన్ ప్రశ్నించారు.కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాన్నారు. చంద్రబాబుకు ప్రజలు ఇచ్చిన అధికారం ఐదేళ్లేనన్నారు. అందులో ఏడాది గడిచిపోయిందన్నారు. నాలుగేళ్ల తర్వాత అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని జగన్ తెలిపారు. మనం ఈరోజు ఏ విత్తు అయితే నాటుతున్నామో రేపు అదే పెరిగి పెద్ద వృక్షంగా మారుతుందని ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి అంటూ జగన్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.