వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపుదశకు చేరుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ఏడాదికి పైగా ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న జగన్ సుమారు 3700 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర బహుశా జనవరి 10వ తేదీన ముగుస్తుందని అనుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగుస్తుంది. ఆ సందర్భంగా ఇచ్ఛాపురంలోనే భారీ బహిరంగసభకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సరే దేశచరిత్రలోనే ఇన్ని వేల కిలోమీటర్లు నడవటమన్నది రికార్డే. అంటే దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లోను రాజకీయ నేతలు పాదయాత్రలు చేయలేదనుకోండి అదివేరే సంగతి. సరే ఏదేమైనా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశ్యంతో తండ్రి, కొడుకులు ఇద్దరూ వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేయటం అరుదైన ఘటనగానే చెప్పుకోవాలి.
ఏరోజైతే పాదయాత్ర ముగిసి బహిరంగ సభ కూడా జరుగుతుందో అదే రోజు జగన్ నేరుగా తిరుపతికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అదే రోజు రాత్రి తిరుపతిలోని గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు ఉదయమే తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నుండి కాలినడకన బయలుదేరుతారు. పాదయాత్ర విజయవంతంగా పూర్తయితే నేరుగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటానని జగన్ మొదట్లోనే వెంకటేశ్వరస్వామిని మొక్కుక్కున్నారట. పోయిన ఏడాది నవంబర్ 6వ తేదీన పులివెందుల నియోజకవర్గంలోని ఇపుపులపాయలో పాదయాత్ర మొదలైన సందర్భంగా కూడా జగన్ ముందుగా తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న విషయం అందరికీ తెలిసిందే.
తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ లాగ జగన్ కు కూడా వెంకటేశ్వరస్వామి మీద భక్తి ఎక్కువలాగుంది. అందుకనే వీలున్నప్పుడల్లా జగన్ కూడా తిరుమలకు వచ్చి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటుంటారు. కాబట్టి వచ్చేనెలలో పాదయాత్ర తర్వాత నేరుగా శ్రీవారిని దర్శించుకుని కానీ మరే ఇతర కార్యక్రమాలు చేపట్టకూడదని జగన్ అనుకున్నారట. మొత్తంమీద జగన్ పాదయాత్రలో 140 నియోజకవర్గాల్లో పర్యటించారు. 2.70 కోట్లమందిని నేరుగా కలిశారు. రెండోదశ బస్సుయాత్రకు కూడా జగన్ త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు సమాచారం.