వైఎస్ జగన్ ‘స్క్రిప్టు’ మార్చాల్సిందే.!

దత్త పుత్రుడు, దుష్ట చతుష్టయం.. ఇలాంటి మాటలకు కాలం చెల్లింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలా మాట్లాడుతోంటే, జనం వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. కొందరైతే, చీదరించుకుంటున్నారు కూడా.!

డబ్బులిచ్చి మరీ జనాల్ని తరలిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభలకి. ఇది చంద్రబాబు హయాంలో కూడా జరిగింది. ఒకప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ప్రధాన రాజకీయ పార్టీలు డబ్బులిచ్చి జనాన్ని తరలించాల్సిందే.

ఇంత కష్టపడినాగానీ, జనం ముఖ్యమంత్రి చెబుతున్న మాటల్ని కడదాకా వినడంలేదు. ‘పోటెత్తిన జనం..’ అని వైసీపీ చెప్పుకుంటే, అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ద్రోహం చేసినట్లే అవుతుంది. నిజాలు మాట్లాడుకుంటే, ఆత్మవిమర్శ చేసుకుంటే.. ‘వై నాట్ 175’ కల సాకారమవుతుంది.

కానీ, వైసీపీ ‘అతి ప్రచారం’ ఆ పార్టీ కొంప ముంచుతోందన్నది నిర్వివాదాంశం. ముఖ్యమంత్రి ఎక్కడ ఏ బహిరంగ సభలో మాట్లాడినా, ‘దుష్ట చతుష్టయం.. దత్త పుత్రుడు..’ అనే మాటలే వస్తున్నాయి. ఈ తరహా మాటలు జనం మీద పెద్దగా ప్రభావం చూపబోవు. ఆ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తెరగాల్సి వుంది.

బందరు పోర్టుకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఇంకోసారి శంకుస్థాపన చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో.. చంద్రబాబు హయాంలో కూడా శంకుస్థాపనలు జరిగాయి. ఈ కొత్త శంకుస్థాపన వల్ల ఒరిగేదేంటి.?