వైసీపీ సుప్రీం వైఎస్ జగన్ వ్యూహాలు గమ్మత్తుగా ఉంటాయి. ప్రత్యర్థిని ఆయన టార్గెట్ చేసే విధానమే వేరు. అందరిలా పెద్ద నోరు వేసేసుకుని శత్రువుల మీద పడిపోరు. టార్గెట్ చేస్తే అవతలి వ్యక్తి దిగిపోవడమే కాదు తన స్థాయి కూడ పెరగాలని భావిస్తారు. అలాగే చేస్తారు కూడ. అందుకు ఉదాహరణే నారా లోకేష్ వ్యవహారం. నారా లోకేష్ మీద జగన్ ఏనాడూ పెద్దగా మాట్లాడింది లేదు. అలా నేరుగా కలుగజేసుకుని మాట్లాడేస్తే లోకేష్‌కు తనతో పాటు సమానమైన స్థాయి ఇచ్చినట్టు ఉంటుందని, అది లోకేష్‌కు కలిసొస్తుందని భావించి ఆయన మీదకు విజయసాయిరెడ్డిని ప్రయోగించారు. జగన్ ఆదేశాలు మేరకు విజయసాయిరెడ్డి తన కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తించారు.
లోకేష్‌ను అలాగే దెబ్బతీశారు :
లోకేష్ రాజకీయాలకు అసమర్థుడు అని ప్రజల్లో భావన కలిగేలా ప్రచారం చేశారు. తెలుగు సరిగా మాట్లాడలేకపోవడం, ఎకధాటి వాక్చాతుర్యం ప్రదర్శించలేకపోవడం లాంటి వాటిని కూడా హైలెట్ చేసి ఏకంగా పప్పు అనే మారుపేరు పెట్టి దారుణమైన రీతిలో అయన ప్రతిష్టను దెబ్బతీశారు. మొత్తంగా ప్రజల్లో ఆయన్ను ఒక అసమర్థుడిగా చిత్రీకరించారు. ఫలితంగా లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి పాలయ్యారు. ఈ దాడిని విజయసాయి ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో లోకేష్ ఎన్నికల్లో గెలవడం కాదు ముందు తన మీద విజయసాయి వేసిన అసమర్ధుడనే ముద్రను చెరుపుకోవడం పెద్ద సవాల్ అయిపోయింది. దానికి ఆయన నానా తంటాలు పడుతున్నారు. విజయసాయికి తోడు కొడాలి నాని లాంటి ఇంకొందరు తయారవడంతో లోకేష్ పరిస్థితి దారుణంగా తయారైంది. అలా జగన్ లోకేష్ మీదకు విజయసాయి రూపంలో పర్మనెంట్ మిస్సైల్ సంధించేశారు.
చంద్రబాబు మీదా అదే ప్రయోగం :
సరిగ్గా ఇలాంటి పరిస్థితినే చంద్రబాబుకు కూడ సృష్టించాలని ప్లాన్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మీద పోట్లాడితే ఆ ప్రతిపక్ష నేతకు ఓ స్థాయి ఉంటుంది. అదే ముఖ్యమంతిగా ఉండి ప్రతిపక్ష నేత మీద దాడికి దిగితే స్థాయి పడిపోతుంది. ప్రతిపక్ష నేత స్థాయిని పెంచినట్టే అవుతుంది. ఈ ఫార్ములా ప్రకారం చంద్రబాబు విషయంలో జగన్ తన జోక్యం కనిపించకుండా ఉండేలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలోకి దింపినట్టు కనబడుతోంది. పెద్దిరెడ్డి, చంద్రబాబుల మధ్యన పోటీ ఈనాటిది కాదు. చదువుకునే రోజుల్లో నేనువ్వా నేనా అన్నట్టు రాజకీయాలు చేశారు. విద్యార్థి సంఘాలను వెనకేసుకొని పోటీ పడ్డారు. కాలం కలిసొచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లగా పెద్దిరెడ్డి జిల్లా రాజకీయాలకే పరిమితమయ్యారు. కానీ జగన్ అండ దోరకంతో ఆయన కూడ ఇప్పుడు బలపడ్డారు. ప్రస్తుతం సీమ రాజకీయం అంతా ఆయన చేతుల్లోనే ఉంది.
అందుకే ఆయన్ను రంగంలోకి దింపినట్టు ఉంది. ఈ ప్రాసెస్ ఈనాటిది కాదు. 2019కి చాలా ముందే మొదలైంది. సీమలో చంద్రబాబుకు ధీటుగా పెద్దిరెడ్డిని నాయకుడిగా తయారుచేయడం స్టార్ట్ చేశారు. పెద్దిరెడ్డికి ఆల్రెడీ చిత్తూరు సహా ఇంకొన్ని సీమ ప్రాంతాల్లో మంచి పలుకుబడి, అనుచరగణం ఉండటంతో జగన్ పని ఇంకా సులువైంది. అన్ని విషయాల్లోనూ జగన్ ఆయన్ను వెన్నంటి ప్రోత్సహించారు. ఎప్పుడైనా సొంత నిర్ణయాలు తీసుకునే వ్యక్తికే నాయకుదిగా గుర్తింపు ఉంటుంది. అందుకే జగన్ అభ్యర్థుల ఎంపికలో, రాజకీయ వ్యూహాల రచనలో పెద్దిరెడ్డికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయన వ్యూహాలు నూటికి 90 శాతం ఫలించాయి. గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీని కనుమరుగు చేయడంలో ఆయన విజయం సాధించారు. ఆ ఎన్నికలు టీడీపీ రెండంటే రెండే స్థానాలకు పరిమితమైంది.
ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బాబును కుప్పంలో కూడ లేకుండా చేయాలనేది పెద్దిరెడ్డిగారికి జగన్ ఇచ్చిన టార్గెట్. అందుకే అదును చూసుకుని పెద్దిరెడ్డి సవాల్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఈమధ్య పెద్దిరెడ్డిపై చంద్రబాబు దళితుల అంశంలో ఎక్కువగానే ఆరోపణలు చేశారు. ఇది ఆయనకు బాగా కలిసొచ్చింది. అదే తడవనుకుని ప్లాన్ అమలుచేశారు. ఎప్పుడూ శాంతంగా కనిపించే పెద్దిరెడ్డి మీడియా ముందు గర్జించినట్టు చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు. తన మీద దళిత వ్యతిరేకి అనే ముద్ర వేసిన బాబు వచ్చే ఎన్నికల్లో చిత్తూరులో గెలవలేరని, ఒకవేళ ఆయనే గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటన చేశారు. ఈ సవాలుకు బాబుగారు ఆవేశపడిపోయి ప్రతిసవాల్ విసిరితే జగన్ అనుకున్నది జరిగినట్టే. సీమలో ఫైట్ అంతా చంద్రబాబు వెర్సెస్ పెద్దిరెడ్డి అన్నట్టే ఉంటుంది. బాబుగారు పెద్దిరెడ్డి స్థాయిలోనే ఆగిపోతారు తప్ప జగన్ వరకు వెళ్ళలేరు. అప్పుడు జగన్ పోటీలేని నాయకుడిగా, తనను ఢీకొట్టే స్థాయి ఎవ్వరికీ లేదన్నట్టుగా వెలిగిపోతారన్నమాట. ఇది అందరికీ సాధ్యమయ్యే రాజకీయం కాదు.. ఒక్క జగన్‌కు మాత్రమే తెలిసిన రాజకీయం.