ప్రభుత్వ పథకం అంటే దానికి ముఖ్యమంత్రి పేరో లేకపోతే ఆయన తండ్రి పేరో లేకపోతే పాలన చేస్తున్న పార్టీ వ్యవహస్థాపకుడి పేరో పెట్టడం మన రాష్ట్రంలో ఆనవాయితీ అయిపోయింది. సంక్షేమ పథకాల లబ్దిని ప్రజలకు అందించాలనే తపన కంటే తమ పేర్లు జనం నోళ్ళలో నానుతూ ఉండాలని, తమను జనం దేవుళ్ళ తరహాలో మననం చేసుకుంటూ ఉండాలనే కోరికే ఎక్కువైంది నేటి రాజకీయ నాయకుల్లో. చంద్రబాబు నాయుడుతోనే ప్రభుత్వ పధకాలకు సొంత పేర్ల పర్వం మొదలైంది. చంద్రన్న కానుక, చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న భీమా, అన్న క్యాంటీన్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు అన్నిటినీ సొంత పేర్లు. చివరికి వాటర్ ట్యాంకులు, శ్మశాన నాటికలు కూడ పార్టీ జెండా రంగులు పులిమేశారు. ఈ తంతు చూసిన జనం ఇదేమి పైత్యం, ప్రభుత్వ ఖజానాతో నడిచే పథకాలకు సొంత పేర్లు ఎలా పెట్టుకుంటారని మండిపడ్డారు.
అయినా పాలకుల్లో మార్పు లేదు. కొత్తగా ఏర్పడిన జగన్ సర్కార్ ఈ ప్రచార పర్వాన్ని చంద్రబాబుకు మించి చేస్తోంది. మొన్నామధ్యన వైసీపీ నేతలు అసెంబ్లీలో పోలవరంలో చంద్రన్న భజన వీడియో పెట్టి కడుపుబ్బా నవ్వుకున్నారు. చంద్రబాబు పబ్లిసిటీ యావ మీద కౌంటర్లు వేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నదేమిటి. అచ్చం చంద్రబాబులానే పబ్లిసిటీ స్టంట్స్. చెప్పాలంటే బాబుగారిని మించి పోతున్నారు. ఇప్పటికే జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన, వైఎస్ఆర్ ఆసరా ఇలా ప్రతి పథకానికి జగన్ పేరో లేకపోతే వైఎస్ఆర్ పేరో పెడుతున్నారు. తాజాగా ప్రభుత్వం ఈరోజు నుండి పేదలకు ఇళ్ల పట్టాలను పంచనుంది. 30.7 లక్షల మందికి నివాస పట్టా స్థలాలను కేటాయించనున్నారు. 50,940 కోట్ల అంచనా వ్యయంతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.28,080 కోట్ల వ్యయంతో మొదటి విడతలో నిర్మించ తలపెట్టిన 15.60 లక్షల ఇళ్లకు వచ్చే నెల ఏడో తేదీ వరకూ ప్రజా ప్రతినిధులు శంకుస్థాపనలు చేస్తారు.
ఈ పథకం కోసం 68,361 ఎకరాల భూమిని సేకరించారు. నిజంగా ఈ పథకం. దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో జగన్ చేసున్నారు. మొత్తం రాష్ట్రం మీద 17004 కాలనీలు ఏర్పాటు కానున్నాయి. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా ఈ కాలనీలు అన్నింటికీ జగన్ పేరునే పెట్టాలని నిర్ణయించారు. అందులో వైఎస్ఆర్ పేరు కలిసొచ్చేలా వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అని నామకరణం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలోని ఇళ్లస్థలాల ప్రాంగణానికి వైఎస్ జగన్మోహనపురం అని పేరు పెట్టి పెద్ద ఆర్చ్ కట్టేశారు. ఇలా ప్రభుత్వ ధనంతో చెప్పాలంటే ప్రజాధనంతో అమలయ్యే పథకాల మీద సొంత పేర్లు, ఫోటోలు వేసుకోవడం ఎంతవరకు సబబు. పథకాన్ని రూపొందించింది, అమలుచేస్తున్నది వారే అయినా ఖర్చు వారిది కాదు కదా. పాలనలో ఉన్నారు కాబట్టి వారి బాధ్యతే అది. దానికే ప్రజల డబ్బుతో చేసే పనులకు తమ పేర్లు, తమవారి పేర్లు పెట్టుకోవడం భావ్యం అనిపించుకోదు.
పనులన్నీ చేస్తున్నది ముఖ్యమంత్రి హోదాలో కాబట్టి ముఖ్యమంత్రి హోదా మీదే పేర్లు పెట్టొచ్చు. ముఖ్యమంత్రి గోరుముద్ద, సీఎం తోఫా, ఏపీ విద్యాకానుక ఇలా పెట్టుకుంటే అది ప్రభుత్వాన్ని ప్రతిబించించేలా ఉంటుంది తప్ప అందులోని వ్యక్తులను కాదు. ప్రభుత్వం ప్రతిబింబిస్తోంది అంటే ప్రజలే కనిపిస్తున్నట్టు లెక్క. మరి పబ్లిసిటీ మోజులో ఉన్న మన పాలకులు ఈ దిశగా ఆలోచిస్తారో లేదో మరి.