బ్రహ్మాస్త్రాలు సిద్ధం… జగన్ సరికొత్త హామీలు ఇవే!

ఏమాటకామాట చెప్పుకోవాలంటే… ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిగిలిన వారితో పోలిస్తే వైసీపీ దూకుడు మీదుంది. అభ్యర్థుల మార్పు చేర్పులు, వారి ఎంపిక, ప్రచార కార్యక్రమాలు, మేనిఫెస్టో పనులు… ఏది చూసుకున్నా, ఎలా చూసుకున్నా వైసీపీ దూకుడుమీదే ఉంది. గెలవడానికి ఉపయోగపడే ఏ చిన్న విషయాన్ని వదులుకోవడం లేదు.. గెలుపుకు అడ్డొచ్చే ఏ విషయాన్ని లైట్ తీసుకోవడం! ఈ క్రమంలో తాజాగా వచ్చే ఎన్నికల్లో ఇవ్వబోయే హామీలపై జగన్ కసరత్తులు పూర్తయ్యాయని తెలుస్తుంది.

ఇప్పటికే సిద్ధం సభలతో హోరెత్తించేస్తున్నారు వైఎస్ జగన్. ఇవి కార్యకర్తలను సిద్ధం చేయడానికి నిర్వహిస్తున్న సభలు అని చెబుతున్నా… ప్రచార సభలను మించి వీటికి హాజరు ఉంటుంది. దీంతో.. ఏపీలో సిద్ధం సభలు పొలిటికల్ గా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో చివరిగా మార్చి 3న జరిగే సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని అంటున్నారు. ఇక సిద్ధం సభలకు సంబంధించిన ఆఖరి సభ కావడంతొ ఇక్కడ రీసౌండ్ మోతెక్కిపోవాలని వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఆ సంగతి అలా ఉంటే… గత ఎన్నికల్లో వైసీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. 175 స్థానాల్లోనూ 151 స్థానాల్లో జెండా ఎగరేసింది. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ గ్రాండ్ విక్టరీకి జగన్ పాదయాత్ర ఎంత మేలు చేసిందో… అదేస్థాయిలో సామాన్యుడి కష్టాన్ని అర్ధం చేసుకుని అందుబాటులోకి తీసుకొచ్చిన పథకాలూ అంతే మేలు చేశాయనే చెప్పాలి. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో సుమారు 90శాతం హామీలను వైసీపీ సర్కార్ అమలు చేసిందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మరో రెండు మూడు కొత్త పథకాలతో వచ్చే ఎన్నికల బరిలోకి దిగాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి గత ఎన్నికల హామీల్లో… పెన్షన్ ను మూడు వేలకు తీసుకెళ్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చినట్లుగానే ఈ ఏడాది జనవరి 1 న 3 వేల రూపాయలు పెన్షన్ అందించారు. ఇదే సమయంలో మరోసారి కూడా ఈ దిశగా హామీ ఉండొచ్చని అంటున్నారు. ఇందులో భాగంగా వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ ను నాలుగు వేలకు పెంచుతామని వైసీపీ హామీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

ఇదే సమయంలో మరో కీలక హామీని కూడా జగన్ తన అంబులపొదిలో నుంచి తీసి వదలబోతున్నారని అంటున్నారు. అదే… “రైతు రుణ మాఫీ”! సీలింగ్ ఎంత అనే విషయంపై ఇంకా క్లారిటీ రానప్పటికీ.. ఈ హామీ మాత్రం ఇవ్వడం కన్ ఫాం అని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ హామీకి సంబంధించిన ఆర్ధిక పరిస్థితులపై జగన్ & కో లెక్కలు గడుతున్నారన్ని అంటున్నారు. ఈ హామీ కూడా జగన్ ప్రకటిస్తే… ఇక వార్ వన్ సైడ్ అనే మాటలు వినిపిస్తున్నాయి!

కాగా… రైతు రుణ మాఫీ అనే హామీని ఇచ్చి 2014 ఎన్నికల్లో టీడీపీ లబ్ధి పొందింది! అయితే ఆ హామీ అమలుపై బాబు చూపిన అశ్రద్ధ, నిర్లక్ష్యం ప్రభావం 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో ఆ పథకం సాధ్యాసాధ్యాలపై ఒక క్లారిటీకి వచ్చిన అనంతరం సీలింగ్ లక్షా, రెండు లక్షలా, మొత్తమా అనే విషయాలపై ఒక స్పష్టత రానుందని తెలుస్తుంది!