పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు.! వైఎస్ జగన్ ఏం సాధిస్తారు.?

ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు ఎన్నికల ప్రచారంలో ఎలాగూ తప్పవు. అధికారిక కార్యక్రమాల్లో ‘స్పేస్’ తీసుకుని మరీ, విపక్షాలపై.. అందునా జనసేన మీద పదే పదే వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల లాభమేంటి.? అని ఆత్మవిమర్శ చేసుకోలేకపోతున్నారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

తాజాగా ‘త్యాగాల త్యాగరాజు’ అంటూ పవన్ కళ్యాణ్‌కి కొత్త పేరు పెట్టిన వైఎస్ జగన్, ‘కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతాడు’ అంటూ సెటైర్లు కూడా వేసేశారు. ఇదేమీ కొత్త వ్యవహారం కాదు. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరీ.. అన్న చందాన, వైఎస్ జగన్ ప్రతిసారీ అదే పాట పాడుతున్నారు.

కొంతమంది పెయిడ్ వైసీపీ నెటిజన్లు, పెయిడ్ మీడియా తప్ప, వైఎస్ జగన్ వ్యాఖ్యల్ని వైసీపీలోనే చాలామంది సమర్థించలేని పరిస్థితి. వారి ఆవేదనని వాట్సాప్ గ్రూపుల్లోనూ, సోషల్ మీడియాలోనూ వ్యక్తం చేస్తున్నారు కూడా.

ముఖ్యమంత్రి అధికారిక వేదికలపై మాట్లాడే ప్రతి మాటా, జనం మెదళ్ళలోకి దూసుకెళుతుంది. అంత కీలక సమయం ఇది. లైవ్ కవరేజీల ద్వారా జనాలకు చేరే విషయాల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్రమత్తంగా వుండాల్సిందే.

రాజకీయ విమర్శలు చేయడానికి, వేరే వేదికలుంటాయ్. వాటిని వైఎస్ జగన్ సద్వినియోగం చేసుకోవచ్చు. వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్‌ని దెబ్బకొట్టేందుకు వైఎస్ జగన్ ఈ పంథాని ఎంచుకుంటే, దాన్ని తప్పు పట్టలేం. కానీ, వేదిక ముఖ్యం.

విద్యార్థులకు సంబంధించిన సంక్షేమ పథకం తాలూకు నిధుల విడుదల కార్యక్రమంలో, రాజకీయ ప్రత్యర్థుల పెళ్ళిళ్ళ, భార్యల ప్రస్తావన.. ముఖ్యమంత్రి స్థాయికి తగదు.